ఆల్‌ ఫ్రీ షో..‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’

26 Feb, 2019 08:13 IST|Sakshi

డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులకు ఉచిత ప్రదర్శనలు

జిల్లా వ్యాప్తంగా షోకు 50 శాతం టిక్కెట్లు ఇవ్వాలని ఆదేశాలు

పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్‌: ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు కోసం ఉచిత షోలు వేస్తున్నారు. ఈనెల 25 ఉదయం, మ్యాట్నీ షోలతో పాటు, 26న నాలుగు షోలలో కూడా తమ పార్టీ నేతలకు, డ్వాక్రా మహిళలకు 50 శాతం టికెట్లు కేటాయించాలన్న టీడీపీ అదేశాలతో ఉషా పిక్చర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని కౌన్సిలర్లతో పాటు టీడీపీ నాయకులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలకు సినిమా చూపించేందుకు  ఏర్పాట్లు చేశారు.

సినిమాను టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం తీయడంతోపాటు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తెరకెక్కించకపోవడంతో సినిమా డిజాస్టర్‌ అయిందని ఎన్టీఆర్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఈ సినిమాను అందరికీ చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉచిత షోలు వేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలను టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు సాధికార మిత్రలుగా నియమించారు. ఇటీవల పోలవరం, అమరావతి చూసేందుకు బస్సుల్లో  తరలించగా, ఇప్పుడు సినిమాలకు తప్పనిసరిగా రావాలని  ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన పోస్ట్‌ పెయిడ్‌ చెక్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడతారోనని తప్పని పరిస్థితుల్లో  వారి మాట వినాల్సి వస్తోందని డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు