మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం

23 Feb, 2019 10:31 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్‌ సీస్‌లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. మహానాయకుడు ప్రీమియర్‌ షోస్‌తో కేవలం ఒక లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ జీవీ వెల్లడించారు. (మూవీ రివ్యూ : యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు)

గత నెల రిలీజ్‌ అయిన కథానాయకుడు ప్రీమియర్‌ షోస్‌కు నాలుగు లక్షలకు పైగా వసూళ్లు వచ్చాయి. కథానాయకుడు రిజల్ట్‌ ప్రభావంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని సంఘటనలను నిష్పాక్షికంగా చూపించే ధైర్యం ‘యన్‌టిఆర్‌’ టీంకు లేదన్న అభిప్రాయానికి ప్రేక్షకులు ముందే వచ్చేయటంతో మహానాయకుడు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా కోటి రూపాయల షేర్‌ కూడా సాధించలేకపోయిందన్న టాక్‌ వినిపిస్తోంది. కథానాయకుడు సినిమాకు ఫుల్‌రన్‌లో రూ. 50 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే మహానాయకుడుకు  కూడా భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వార్తలు