బాబాయ్, అబ్బాయ్... ఎవరి బలమెంత..?

12 Jan, 2016 09:08 IST|Sakshi
బాబాయ్, అబ్బాయ్... ఎవరి బలమెంత..?

ఎన్నడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి వెండితెర మీద భారీ యుద్ధం జరుగుతోంది. నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం, వీటిలో మూడు టాప్ స్టార్ హీరోలు నటించిన సినిమాలే కావటం, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి బాబాయ్, అబ్బాయ్లు బరిలో దిగుతుండటంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. 'నాన్నకు ప్రేమ'తో సినిమాతో వస్తున్న ఎన్టీఆర్, 'డిక్టేటర్'గా గర్జిస్తున్న బాలయ్యల మధ్య పోటినే ప్రధానంగా చర్చకు వస్తోంది. బాలయ్య టిడిపి ఎమ్మెల్యేగా ఉండటం, ఈ మధ్య ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతో ఈ పోటీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి కలిగిస్తోంది.

సినిమాల విడుదల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు కూడా బాగానే సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా సక్సెస్ను డిసైడ్ చేసేది తొలి రోజు.. తొలి వారం కలెక్షన్లే కావటంతో బాబాయ్, అబ్బాయ్లు రికార్డ్ వసూళ్ల మీద కన్నేశారు. అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కించుకోవటం కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయంతో మాత్రమే జరిగిన థియేటర్ల ఎంపికలో ఈ రెండు సినిమాల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా అబ్బాయ్, బాబాయ్కి గట్టి పోటీనే ఇస్తున్నాడట.

సినిమా విషయానికి వస్తే, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్.. హీరోతో పాటు దర్శకుడికి కూడా చాలా కీలకం. వన్ సినిమాతో నిరాశపరిచిన సుకుమార్, తనని తానూ ప్రూవ్ చేసుకోవటం కోసం భారీ హిట్ ఇచ్చి తీరాలి. చాలా రోజులుగా ఫ్లాప్ లలో ఉన్న జూనియర్ టెంపర్ సినిమాతో హిట్ ఇచ్చినా.. ఆ సక్సెస్ లక్ కాదు అనిపించుకోవటం కోసం హిట్ కంపల్సరీ. అందుకే ఇద్దరు కసిగా నాన్నకు ప్రేమతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని ఎన్టీఆర్, ఈ సినిమాలో పూర్తి వెస్ట్రన్ లుక్లో ఆకట్టుకున్నాడు.

ఎన్టీఆర్ లుక్తో పాటు ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వటం నాన్నకు ప్రేమతో సినిమాకు ప్లస్ పాయింట్స్. భారీ ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ తన కెరీర్ లోనే బెస్ట్ అంటున్నారు యూనిట్. సినిమా బడ్జెట్తో పాటు శాటిలైట్ రైట్స్, ఏరియా బిజినెస్ లాంటి విషయాల్లో కూడా జూనియర్, బాబాయ్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరికితే ఎన్టీఆర్ రికార్డ్లు తిరగరాయటం ఖాయంగా కనిపిస్తోంది.

బాబాయ్ బాలయ్య కూడా భారీగానే వస్తున్నాడు. రెగ్యులర్గా చేసే మాస్ తరహా పాత్రలో కాకుండా డిక్టేటర్ సినిమాలో స్టైలిష్ డాన్లా కనిపిస్తున్నాడు బాలకృష్ణ. లౌక్యం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీవాస్, బాలకృష్ణతో ఓ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడియోకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ప్రొమోస్లో బాలయ్య మరోసారి తన మార్క్ పంచ్ డైలాగ్లతోఅలరిస్తున్నాడు. అయితే ఇటీవల వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ కోన వెంకట్, గోపి మోహన్, శ్రీధర్ సీపానలతో కలిసి కథా కథనాలు అందించటం డిక్టేటర్ పై అనుమానాలు కలిగిస్తోంది. బడ్జెట్ పరంగానే కాదు, బిజినెస్ పరంగా కూడా, డిక్టేటర్ బాలయ్య కెరీర్ లోనే టాప్గా నిలిచింది.

శ్రీవాస్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ పాళ్లు బాగానే ఉంటాయి. దీనికి తోడు భారీ తారాగణంతో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎలాగూ ఉంటుంది. అంజలి, సోనాల్ చౌహాన్ల గ్లామర్ సినిమాకు యాడెడ్ ఎట్రాక్షన్. ఇది బాలయ్య 99వ సినిమా కావటంతో సినిమాకు భారీ వసూళ్లను అందించి 100వ సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా అన్ని రకాలుగా బాలయ్య కూడా భారీ హిట్నే టార్గెట్ చేశాడు.

రెండు సినిమాలు యు/ఎ సర్టిఫికేట్తోనే రిలీజ్ అవుతుండటం, రెండూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఎమోషనల్ డ్రామాస్ కావటం, ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన అగ్రకథానాయకులు కావటం, గతంలో ఎప్పుడూ ముఖాముఖి తలపడని ఇద్దరు సంక్రాంతి బరిలో కాలు దువ్వుతుండటం, తొలిసారిగా సినిమా బిజినెస్లో రాజకీయ ప్రమేయం ప్రత్యక్షంగా కనిపించటం లాంటివి ఈసారి పోటిని మరింత వేడెక్కిస్తున్నాయి. మరి ఈ యుద్ధంలో బాబాయ్, అబ్బాయ్లలో గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం మరో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల పోటి ఎలాగున్నా, అభిమానులకు మాత్రం ఈ సంక్రాంతి అతి పెద్ద సినిమా పండుగే అవుతోంది.