పిట్ట కథకూ నాకూ లింక్‌ ఉంది

27 Jan, 2020 00:30 IST|Sakshi
బ్రహ్మాజీ, ఆనందప్రసాద్, త్రివిక్రమ్, చందు

– త్రివిక్రమ్‌

‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్‌ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్‌ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్‌ నాకు బాగా నచ్చింది. ఇట్స్‌ ఎ లాంగ్‌ స్టోరీ అని క్యాప్షన్‌ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్‌’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ సంస్థపై ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను త్రివిక్రమ్‌ విడుదల చేశారు.

నిర్మాత ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘స్టార్‌  హీరోలతో చాలా కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్‌ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్‌ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్‌ అంశాలతో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్‌ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు.

మరిన్ని వార్తలు