'ఒక్క క్షణం' మూవీ రివ్యూ

28 Dec, 2017 12:36 IST|Sakshi

టైటిల్ : ఒక్క క్షణం
జానర్ : సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్
తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : చక్రి చిగురుపాటి

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..?

కథ :
జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్‌మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్  ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్‌మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..?

నటీనటులు :
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు.

విశ్లేషణ :
తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరం‍గా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ లోని మలుపులు
ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా వేగం తగ్గిన కథనం
సంగీతం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు