ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు..!

4 Dec, 2017 11:38 IST|Sakshi

సాక్షి, తమిళ సినిమా: కొన్ని చిత్రాల విడుదలలో జాప్యానికి కారణాలు చెప్పలేం. అలా ఒక వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏళ్ల పాటు విడుదలకు ఎదురు చూస్తోంది. అదే డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన కళవాడియ పొళుదుగళ్‌. నటి భూమిక నాయకిగా నటించారు. దర్శకుడు తంగర్‌బచ్చన్‌ చిత్రాలు ఇతర చిత్రాలకు భిన్నంగానూ, విలువలతో కూడినవిగా ఉంటాయి. అళగి, ఒంబదురూపాయ్‌ నోటు, సొల్లమరంద కథై, పళ్లికూట్టం వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఆయన తదుపరి చిత్రం కలవాడియ పొళుదుగళ్‌. ప్రకాశ్‌రాజ్, సత్యన్‌ ప్రముఖ పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని ఐన్‌గరన్‌ ఫిలింస్‌ పతాకంపై కరుణాకరన్‌ నిర్మించారు. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రానికిప్పుడు మోక్షం కలిగింది.

పలు రకాల సంకెళ్లను తెంచుకుని ఈ నెలలోనే విడుదల కానందని చిత్ర నిర్మాత కరుణాకరన్‌ వెల్లడించారు. ప్రేమ బాధను తప్పించుకోని మనిషి ఉండరని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి వ్యక్తి ప్రేమ ఫలించదు. అలాంటి ప్రేమ నేపథ్యంలో రూపొందించిన చిత్రం కలవాడియ పొదుళుదుగళ్‌ అని చిత్ర దర్శకుడు తంగర్‌బచ్చన్‌ తెలిపారు. ప్రభుదేవా కథ చదివి పూర్తి చేసిన వెంటనే ఇందులో తాను నటిస్తున్నానని చెప్పి, ఇలాంటి పాత్రలో తానిప్పటి వరకూ నటించలేదని ప్రశంసించారన్నారు. అదే విధంగా ప్రకాశ్‌రాజ్, భూమికల పాత్రలు చాలా ప్రాధాన్యంతో కూడి ఉంటాయని తెలిపారు. చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

మరిన్ని వార్తలు