లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే!

19 Nov, 2018 23:53 IST|Sakshi

ఈ సన్నివేశం సినిమాల్లో బాగా చూసి ఉంటారు.హీరోయిన్‌  వెళ్లిపోతుంటే హీరో చూస్తుంటాడు.ఫ్రెండ్‌తో చెబుతాడు – అమ్మాయి తిరిగి చూసిందంటే లవ్‌లో పడినట్లే అని.అమ్మాయి తిరిగి చూస్తుంది. ఆడియన్స్‌ కూడా హీరోలాంటి వాళ్లే.ఏ హీరోయిన్‌ తిరిగి వచ్చినా..ఏ హీరో రిటర్న్‌ ఇచ్చినా లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే.

సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీతో పాటు రీఎంట్రీ కూడా ఉంటుంది. చనిపోయాడనుకున్న హీరో సెకండ్‌హాఫ్‌లో బతికి కనిపించినట్టే తెరమరుగైపోయారనుకున్న తారలు ఒక్కసారిగా మళ్లీ స్క్రీన్‌ మీద తళుక్కుమని మెరవడానికి వస్తారు. ఒక్కోసారి ఎంట్రీలోని ఇమేజ్‌ కన్నా రీఎంట్రీలోని క్రేజ్‌ వారిని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి వంటి మెగాస్టారే బ్రేక్‌ తీసుకుని రీఎంట్రీ ఇచ్చినప్పుడు.. పెళ్లి, బాధ్యతలు, సరైన పాత్రలు రాకపోవడం వంటి కారణాల వల్ల బ్రేక్‌ తీసుకున్నవారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముంది? సీనియర్‌ నటి జయప్రదతో పాటు ఇలియానా, లయ, ప్రియమణి, సంగీత, భాగ్యశ్రీ, హీరో ఆర్యన్‌ రాజేశ్‌ తదితరులు టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు. టేక్‌కి రెడీ అంటున్నారు.

జయప్రదం
‘ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం’.. అన్న జయప్రద ఆ తర్వాత దశ తిరిగి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నారు. 1970ల చివరలో 1980లలో ఆమె స్టార్‌ హీరోయిన్‌. అయితే ఇక్కడ కెరీర్‌ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లిపోయి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు. ఆ తర్వాత కొత్తతరం రావడం, రాజకీయాల్లో బిజీ కావడం తదితర కారణాల వల్ల తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం జరగలేదు. ‘సాగర సంగమం’, ‘దేవత’ వంటి మంచి సినిమాలు చేసిన జయప్రద తెలుగు సినిమాలో మళ్లీ కనిపిస్తే ప్రేక్షకులకు అదే పెద్ద ఆనందం.పి.వాసు దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘మహారథి’లో కీలక పాత్రలో నటించిన ఆమె 11ఏళ్ల తర్వాత ‘శరభ’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్‌.నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆమెను తెలుగులో బిజీ చేస్తుందని ఆశిద్దాం.  సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే ‘సువర్ణ సుందరి’ అనే మరో తెలుగు చిత్రంలోనూ జయప్రద ముఖ్యమైన పాత్ర చేశారు. సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా రెండు సినిమాలతో జయప్రదంగా ఆమె రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందం.

గోవా బ్యూటీ  వచ్చేశారు
‘దేవదాసు’ ఆ వెంటనే ‘పోకిరి’ సినిమాతో యూత్‌ గుండె గోడల మీద పోస్టర్‌ గర్ల్‌గా నిలిచారు ఇలియానా. ఆ తర్వాత మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ .. వంటి హీరోలందరితో జోడీ కట్టారు. ‘జల్సా’, ‘కిక్‌’, ‘జులాయి’ వంటి సూపర్‌ హిట్స్‌ ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. టాలీవుడ్‌లో అతి తక్కువ టైమ్‌లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న స్టార్‌ హీరోయిన్‌గా ఆమెకు పేరుంది.2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌కి బై చెప్పి ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయారామె. ఆరేళ్ల తర్వాత ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ (అఅఆ)తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’  ఈ నెల 16న రిలీజైంది. ఇలియానా టాలీవుడ్‌కి వచ్చిన 12ఏళ్లలో తొలిసారి ‘అఅఆ’కి డబ్బింగ్‌ చెప్పారు.ఈ రీఎంట్రీతో ఆమె మరిన్ని సినిమాలు చేస్తారని చెప్పవచ్చు.
 
ప్రియమైన వెన్నెల
ప్రియమణి తెలుగు టీవీ కార్యక్రమాలలో  కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హుషారైన బాడీ లాంగ్వేజ్‌తో, అందమైన చిరునవ్వు, యాక్టింగ్‌ టాలెంట్‌తో ముఖ్యమైన హీరోలతో పని చేసిన ప్రియమణి ఎక్కువ కాలం తెలుగు మీద ఫోకస్‌ చేయలేదనే చెప్పాలి. ఎక్కువ సమయం హీరోయిన్‌గా నిలవలేదనీ చెప్పాలి. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను సుడిగాలిలా చుట్టి ఖాళీ అయిన ఈ నటి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో షారుక్‌ ఖాన్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేసి తానున్నట్టు రిఫ్రెష్‌ బటన్‌ నొక్కారు. 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ప్రకాష్‌ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

మైనే ఫిర్‌ ఆగయీ
భాగ్యశ్రీని చూసి కనీసం అరకోటి మంది అబ్బాయిలైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు ‘మైనే ప్యార్‌ కియా’ సమయంలో. అయితే ఆమె సినిమాల్లో కంటిన్యూ కాకుండా హిమాలయ్‌ను భర్తగా చేసుకుని లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. తెలుగులో ‘ఓంకారమ్‌’, ‘రాణా’ సినిమాల్లో ఆమె నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998లో వచ్చిన ‘రాణా’ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ 20ఏళ్ల తర్వాత ‘2 స్టేట్స్‌’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. టాలీవుడ్‌ కే పాస్‌ మై ఫిర్‌ ఆగయీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగ్యశ్రీ. 
 
తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ
‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలి పాత్రలో లయ నటించారనడం కంటే జీవించారనడం కరెక్టేమో. 1992లో అక్కినేని కుటుంబరావ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా మారారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి, అలరించారు. ‘మనోహరం, ‘ప్రేమించు’ చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2010లో ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి కుటుంబంతో అమెరికాలో సెటిల్‌ అయిపోయారు. చాలా రోజులుగా లయ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత తాజాగా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు లయ. ఈ చిత్రంతోనే లయ కూతురు శ్లోక బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఒకే సినిమాతో తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ .. ప్రేక్షకులకు డబుల్‌ ధమాకాయే కదా! 

ఆరేళ్ల తర్వాత హాయ్‌ 
తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘హాయ్‌’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హాయ్‌ చెప్పారు ఆర్యన్‌ రాజేష్‌. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేశారు.రామకృష్ణ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు. ఆరేళ్ల తర్వాత తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ (రామ్‌చరణ్‌) సోదరుని పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 

పద్మావతి వస్తున్నారహో... 
సంగీత మంచి డాన్సర్, నటి. ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలోని ‘పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే.. దగ దగ ముద్దొస్తున్నావే’ పాట ఆమెకు మంచి హిట్‌ ఇచ్చింది. 1999లో ‘ఆశల సందడి’ సినిమాతో  ఎంట్రీ ఇచ్చిన సంగీత ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘సంక్రాంతి’ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వచ్చిన ‘కారా మజాకా’ చిత్రంలో నటించిన సంగీత ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు. 8 ఏళ్ల విరామం తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారామె. ‘‘తెలుగులో ఇది నా సెకండ్‌ ఇన్నింగ్స్‌.. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు సంగీత. 

పాతికేళ్ల తర్వాత టాలీవుడ్‌కి... 
‘సాక్షి’, ‘మగాడు’, ‘దోషి..నిర్దోషి’, ‘20వ శతాబ్దం’... తదితర చిత్రాలతో 1990వ దశకంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని టాలీవుడ్‌కి దూరంగా ఉండిపోయారు. 25ఏళ్ల తర్వాత ‘ఛల్‌ మోహన్‌రంగ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా అడివి శేష్, శివాని రాజశేఖర్‌ జంటగా తెరకెక్కుతున్న ‘2 స్టేట్స్‌’ సినిమాలో లిజీ ఓ కీలక పాత్ర చేసేందుకు అంగీకరించారని వార్త. అలాగే ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ వాణీ విశ్వనాథ్‌ 11 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించారు. ఇక 1980లో ‘మా భూమి’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిచంద్‌ చిరంజీవితో ‘మంచు పల్లకీ’తో పాటు అనేక చిత్రాల్లో నటించారు. 1989లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదాయన. 27ఏళ్ల తర్వాత ‘ఫిదా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. దాంతో ‘మంచుపల్లకీ’ తర్వాత 36 ఏళ్లకు చిరంజీవి, సాయిచంద్‌ కలిసి నటించినట్టవుతుంది ఈ సినిమాతో. 
– ఇన్‌పుట్స్‌: డేరంగుల జగన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు