సింగిల్ డైరెక్ట‌ర్.. మెనీ స్టోరీస్...

5 Jul, 2016 00:00 IST|Sakshi
సింగిల్ డైరెక్ట‌ర్.. మెనీ స్టోరీస్...

షూటింగ్ పూర్తయ్యిందంటే గుమ్మడికాయ పగలాల్సిందే. షూటింగ్ స్టార్ట్ అయ్యిందంటే కొబ్బరికాయ కొట్టాల్సిందే. ఈ దర్శకులలో ఏ దర్శకుని శ్రీమతిని అడిగినా.. ‘ఏమో అండీ! గుమ్మడికాయ పులుసు ఆరగించి కాస్త విశ్రాంతి తీసుకుంటారనుకున్నా. పొద్దున్నే కొబ్బరి పచ్చడి కావాలని ఒక్కటే గొడవ. మా శ్రీవారి వాలకం ఇది’ అంటున్నారు. ఈ దర్శకులందరూ ఓ సినిమా పూర్తవగానే ఇంకో సినిమా గుర్రం ఎక్కుతున్నారు. ఓ గుర్రం దిగితే ఇంకో గుర్రం ఎక్కడం కామనే కదా అనే డౌట్ వస్తోందా! వీళ్లు గుమ్మడి పులుసులోనే కొబ్బరి పచ్చడి నంజుకుంటున్నారు. అదేనండీ.. ఓ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే మరో సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇలా రెండు మూడు గుర్రాల మీద స్వారీ చేస్తున్న ‘సింగిల్ డైరెక్ట‌ర్.. మెనీ స్టోరీస్’ కథ ఇది.
 
డిక్షనరీలో ఆ మాట లేదు
రామ్‌గోపాల్ వర్మ డిక్షనరీలో ఖాళీ అనే పదానికి చోటు లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వర్మ పర్సనల్ థియేటర్‌లో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు ఆడుతుంటాయి. స్క్రిప్ట్ వర్క్‌లో ఒకటి, సెట్స్‌పై మరొకటి, రిలీజ్‌కి రెడీగా ఉన్నదొకటి, ప్రకటనలకు పరిమితమైన సినిమా ఇంకొకటి! వర్మ ఏం చేసినా సంచలనమే. ‘రక్త చరిత్ర’, ‘బెజవాడ’ సినిమాలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వర్మ మరోసారి రాజకీయ నాయకులకు, మీడియాకు పని కల్పిస్తున్నారు.

వంగవీటి రంగా జీవితం ఆధారంగా ‘వంగవీటి’ తీస్తున్నట్టు ప్రకటించారు. ఆయనకు బాగా ఇష్టమైన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్‌లో తీసిన ‘రాయ్’ (కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ముత్తప్పారాయ్ జీవితం ఆధారంగా) విడుదలకు సిద్ధమవుతోంది. ఇక, వర్మ దర్శకత్వంలో సచిన్ జోషీ, మీరా చోప్రా జంటగా నటించిన ‘మొగలిపువ్వు’ ఫస్ట్‌లుక్, ట్రైలర్‌లు విడుదలై చాలా రోజులైంది. అలాగే రాజశేఖర్‌తో ‘పట్ట పగలు’ అనే హారర్ సినిమా తీశారు. ఈ రెండు చిత్రాల విడుదల ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సెట్స్ మీద ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయని టాక్.  
 
రివర్స్ గేర్..
సినిమా హిట్టయితే దర్శకుణ్ణి భేష్ అంటారు. ఫట్టయితే వేస్ట్ అంటారు. కానీ, కృష్ణవంశీ విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరుగుతుంది. ఆయన సినిమా ఫట్టయినా.. అందులో మాట్లాడుకోవడానికి నాలుగు మంచి మాటలుంటాయ్. కృష్ణవంశీ క్రియేటివిటీ అలాంటిది. మాములుగా కృష్ణవంశీ సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకుంటారు. కానీ, ఈసారి గేర్ రివర్స్‌లో ఉంది. ఆయన కూడా జోరు మీద ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ తీస్తున్నారు. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా ‘రైతు’ సినిమా చేస్తారు. ఇది బాలకృష్ణకు 101వ సినిమా అవుతుంది.
 
పూరి జ‘గన్
లోడ్ చేసిన గన్, పూరి జగన్నాథ్ బ్రెయిన్ ఒక్కటే. గన్‌లో నుంచి బుల్లెట్స్ ఎంత స్పీడుగా వస్తాయో.. పూరి బ్రెయిన్‌లో ఆలోచనలు అంతకంటే స్పీడుగా వస్తాయి. సినిమాలో మాటల తూటాలు పేల్చడమే కాదు, ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు. ప్రస్తుతం ‘మహాత్మ’ చిత్ర నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ చిత్రీకరణ పూర్తి చేశారు పూరి.

వెంటనే నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ‘ఇజం’ మొదలుపెట్టేశారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో సినిమా ప్రారంభిస్తారు. ఇటీవలే కథ కూడా వినిపించారు. నందమూరి బ్రదర్స్ తర్వాత మహేష్‌బాబుతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నట్లు టాక్. దానికి ‘జన గణ మణ’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఎప్పటిలానే పూరి జోరు మీద ఉన్నారు.
 
ఒకటి లేట్ అయినా.. మరోటి!

గౌతమ్ మీనన్‌ది కూడా వర్మ స్టైలే. ఓ సినిమా షూటింగ్‌కి ఎండ్ కార్డ్ వేయకముందే మరో సినిమాకి క్లాప్ బోర్డ్ రెడీ చేసేస్తారు. అజిత్‌తో తీసిన ‘ఎన్నై అరిందాల్’ (తెలుగులో ‘ఎంతవాడు గాని’) విడుదలకు సిద్ధమైన సమయంలోనే నాగ చైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ప్రారంభించారు. ఈ కథనే తమిళంలో శింబు హీరోగా తీశారు. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

మధ్యలో ఈ సినిమా షూటింగ్ లేట్ కావడంతో తమిళ చిత్రం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ కథ సిద్ధం చేశారు. ఇందులో ధనుష్ హీరో. రానా దగ్గుబాటి కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఓ భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు హీరో సాయిధరమ్ తేజ్, తమిళ హీరో ‘జయం’ రవి, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, మలయాళ హీరో పృథ్వీరాజ్‌లతో ఈ మల్టీస్టారర్ మూవీ తీయాలనుకుంటున్నారట. అనుష్క, తమన్నాలను కథానాయికలుగా అనుకుంటున్నారని టాక్.
 
జోరుగా...
కమర్షియల్ కథలకు సందేశాత్మక సొబగులు అద్ది సినిమా తీయడం దర్శకుడు కొరటాల శివ స్పెషాలిటీ. స్వతహాగా రచయిత కావడంతో ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లో హీరోయిజం, సందేశం, వినోదం, భావోద్వేగాలు అన్నిటినీ మేళవించి ప్రేక్షకులకు విందు భోజనం పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’కి దర్శ కత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తారు. ‘శ్రీమంతుడు’ కంటే ముందే చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో కొరటాల ఓ సినిమా చేయాల్సింది. ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆ సినిమా ఆగింది. మళ్లీ ఈ కాంబినేషన్ కుదిరింది. మొత్తం మీద ఒక సినిమా తర్వాత మరొకటి చేస్తూ.. గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు కొరటాల శివ.
 
అక్కడ పూర్తి.. ఇక్కడ మొదలు!
విభిన్న కథాంశాలతో మంచి మాస్ మూవీస్ తీసే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్. ఆయన తీసే అన్ని చిత్రాల కథలూ డిఫరెంట్‌గా ఊంటాయి. మరి.. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో కానీ, ఒక సినిమా చేసేటప్పుడే మరో డిఫరెంట్ స్టోరీ రెడీ చేసేస్తారు. హిందీలో సోనాక్షీ సిన్హా కథానాయికగా ‘అఖీరా’ సినిమా చేశారు మురుగదాస్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. మహేశ్‌బాబు హీరోగా భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
- సత్య పులగం
 
వీళ్లంతా ఏం చేస్తున్నారంటే..
ఆన్ సెట్స్‌లో ఓ సినిమా ఉన్నప్పుడే మరో సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల గురించి పక్కన పెట్టి.. ప్రస్తుతం ఆన్ సెట్స్‌లో ఒక సినిమాతో బిజీగా ఉన్న దర్శకులు, ఆన్ సెట్స్‌కి తీసుకెళ్లడానికి సినిమా ప్లాన్ చేస్తున్న దర్శకుల విషయానికొస్తే.. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో రాజమౌళి క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్‌బాబుతో సినిమా చేస్తారని టాక్. చిరంజీవి 150వ చిత్రంతో వీవీ వినాయక్ ఫుల్ బిజీ. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, తండ్రితో సినిమా పూర్తయ్యాక వినాయక్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. రామ్‌చరణ్ హీరోగా ‘ధ్రువ’ చిత్రం షూటింగ్‌లో  సురేందర్‌రెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఇటీవల నితిన్‌తో త్రివిక్రమ్ ‘అఆ’ వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన విషయం తెలిసిందే. తదుపరి సినిమా పవన్ కల్యాణ్‌తో చేస్తారని వినికిడి. ‘సరైనోడు’ వంటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నారు. అలాగే, ఈ మధ్య బాలకృష్ణను బోయపాటి కలిశారట.

మరి.. ఆయనతో సినిమా చేస్తారా? లేక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పరిచయ చిత్రానికి సంబంధించిన చర్చలేమైనా జరుపుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్‌తో ‘రాయబారి’ చేస్తారని టాక్. వాస్తవానికి ’కంచె’ తర్వాత ఈ సినిమానే చేయాలనుకున్నారు. ఈలోపు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదలుపెట్టారు. ‘రాయబారి’కి పడినది తాత్కాలిక బ్రేకేనా..? అనేది కాలమే చెప్పాలి. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ చేస్తున్నారు మారుతి. అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహించనున్న చిత్రం త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది.

>