వెనక్కి వెళ్లేది లేదు

5 Oct, 2019 01:56 IST|Sakshi
నవీన్‌ విజయ కృష్ణ

‘‘హీరోతో పోలిస్తే ఎడిటర్‌ జాబ్‌ కొంచెం సులభం అని నా అభిప్రాయం. ఎడిటర్‌గా ఒక చోట కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు. కానీ హీరోగా ఉండటం కష్టం. ప్రేక్షకులు, మీడియా ఫోకస్‌ అంతా నటులపైనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? మన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ గమనిస్తూనే ఉంటారు’’ అన్నారు నవీన్‌ విజయకృష్ణ. ఎడిటర్‌ నుంచి హీరోగా మారిన నవీన్‌.. సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడనే విషయం తెలిసిందే. బాలాజీ సనాల దర్శకత్వంలో నవీన్‌ విజయ కృష్ణ, శ్రీనివాస్‌ అవసరాల, మేఘా చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’.

శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పీఎల్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ– ‘‘నాకు 16ఏళ్ల వయసులో రానా వాళ్ల యాడ్‌ కంపెనీలో చేరాను. నా ఎడిటింగ్‌ స్కిల్స్‌ చూసి కృష్ణవంశీగారు ‘డేంజర్‌’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘రాఖీ, చందమామ’ మరికొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పని చేశాను. ఆ తర్వాత హీరోగా మారాలనుకున్నప్పుడు మా నాన్నగారు కష్టం అన్నారు. దానికి కారణం నేను చాలా లావుగా ఉండేవాణ్ణి. శ్రమించి బరువు తగ్గాను.

నా కెరీర్‌కు సంబంధించిన ప్రతి విషయం నాన్నగారితో చర్చించి, ఆయన్ను ఇబ్బంది పెట్టను. కానీ నాన్న విలువైన సలహాలు ఇస్తుంటారు. మహేశ్‌ అన్న కూడా బాగా సపోర్ట్‌ చేస్తారు. ప్రతీ సినిమా ఫంక్షన్‌కు ఆయన్ను పిలవడం కరెక్ట్‌ కాదు. 16 ఏళ్లకు ఎడిటింగ్‌ మొదలుపెట్టాను. 32 ఏళ్లకు హీరోగా మారాను. ఈ సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుడి దృష్టిలో పడాలంటే టైటిల్‌ భిన్నంగా ఉండాలి. అందుకే ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్‌ పెట్టాం. రెండు జంటల ప్రేమ, వాళ్ల ఊరి కట్టుబాట్లకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. మళ్లీ ఎడిటింగ్‌ వైపు వెనక్కి వెళ్లను. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచ నలు ఉన్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు