ఘాజీ బాబా వచ్చేశారు

2 Mar, 2019 02:09 IST|Sakshi
అబ్బూరి రవి, త్రివిక్రమ్‌

‘‘బొమ్మరిల్లు, అతిథి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కిక్, మిస్టర్‌ పర్ఫెక్ట్, పంజా, ఎవడు, కేరింత, చీకటి రాజ్యం, ఊపిరి, గూఢచారి’ వంటి చిత్రాల రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అబ్బూరి రవిని నటుడిగా పరిచయం చేస్తున్నారు దర్శకుడు అడివి సాయికిరణ్‌. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. ఆది సాయికుమార్‌ హీరోగా, శషా చెత్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్‌ నందం, కృష్ణుడు, అనీశ్‌ కురువిళ్ల్ల, రావు రమేశ్‌ కీలకపాత్రల్లో నటించారు.

ప్రతిభా అడివి, కట్ట ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గేరి. బిహెచ్, సతీష్‌ డేగలతో పాటు ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో తీవ్రవాది ‘ఘాజీ బాబా’ పాత్రలో అబ్బూరి రవి నటించారు. ఆయన ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే... అబ్బూని (అబ్బూరి రవి) విలన్‌గా పరిచయం చేయడం. నేనూ, రవి కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడు. కశ్మీరీ పండిట్‌ల సమస్య మీద సాయి కిరణ్‌గారు తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘నన్ను రచయితగా లాంచ్‌ చేసింది త్రివిక్రమే. ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’లో నా లుక్‌ తన చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. అడివి సాయి కిరణ్‌తో ‘కేరింత’ సినిమాకు వర్క్‌ చేశా. నన్ను టెర్రరిస్ట్‌ (సినిమాలో పాత్రని ఉద్దేశించి) గా చూస్తాడని కలలో కూడా ఊహించలేదు (నవ్వుతూ)’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘ఘాజీ బాబా పాత్రలో నటించమని అబ్బూరి రవిగార్ని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది’’ అన్నారు సాయి కిరణ్‌ అడివి. ఈ చిత్రానికి కెమెరా: జయపాల్‌ రెడ్డి నిమ్మల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌ రెడ్డి తుమ్మ, కో ప్రొడ్యూసర్‌: దామోదర్‌ యాదవ్‌ (వైజాగ్‌).

మరిన్ని వార్తలు