ఆస్కార్... ఫుల్ జోర్!

24 Feb, 2016 23:31 IST|Sakshi
ఆస్కార్... ఫుల్ జోర్!

హాలీవుడ్‌లో ‘ఆస్కార్’ ఫీవర్ మొదలైంది. ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డ్ వేడుక కోసం నిర్వాహకులు సర్వసన్నాహాలు చేస్తున్నారు. అవార్డుకు వేదికగా నిలవనున్న డాల్బీ థియేటర్ అందంగా ముస్తాబవుతోంది. ‘ది మోస్ట్ గ్లామరస్ నైట్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తళతళలాడే బంగారు బొమ్మ వరించేది ఎవరిని అంటూ హాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ అవార్డుల వేడుక గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు...

ఈ ఏడాది వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్  తీసుకున్నవాళ్లే కావడం విశేషం.  

‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో ఈసారి ఉత్తమ చిత్రం విభాగాల్లో నిలిచిన రెండు చిత్రాల్లో తెరపై మెరిశారు. ఆ సినిమాల్లో ఒకటి... ‘ద రెవరెంట్’, మరొకటి ‘రూమ్’. విశేషం ఏంటంటే... ‘ద రెవరెంట్’ చిత్రంలో ఆయనది ప్రధాన పాత్ర. తద్వారా ఉత్తమ నటుడి విభాగంలో ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు. ఇక, ఉత్తమ చిత్రం విభాగంలో ఉన్న మరో చిత్రం ‘రూమ్’లోనూ ఆయన కనిపిస్తారు. కానీ, ఫొటో రూపంలోనే. ఈ చిత్రంలోని బాల నటుడు, డికాప్రియోకు వీరాభిమాని. ఆ అభిమానాన్ని వ్యక్తపరిచే సన్నివేశాల్లో లియొనార్డో ఫొటో కనిపిస్తుంది.

ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలెన్ ‘క్రీడ్’ చిత్రంలో పోషించిన రాకీ బాల్బోవా అనే పాత్ర కోసం ఉత్తమ సహాయ నటుడి విభాగంలో నామి నేషన్ దక్కించుకున్నారు.

1976లో నటించిన ‘రాకీ’లో కూడా ఆయన పాత్ర పేరు రాకీ బాల్బోవానే. ఆ చిత్రంలో రాకీ బాల్బోవా అనేది హీరో పాత్ర అయితే తాజా చిత్రం ‘క్రీడ్’లో సహాయ నటుడి పాత్ర. అప్పట్లో సిల్వెస్టర్ స్టాలెన్ ఆ పాత్ర కోసం ఆస్కార్ నామినేషన్  దక్కించు కున్నారు. మొదటిసారి ఆయనకు నామినేషన్ దక్కింది ఆ పాత్రకే. ఇప్పుడుమళ్లీ అదే పేరుతో చేసిన పాత్రకు నామినేషన్ దక్కించుకోవడం విశేషం. ఇలా ఒకే పాత్ర పేరుతో ఆస్కార్ బరిలో నిలిచిన రెండో నటుడిగా స్టాలెన్ ఓ రికార్డ్ దక్కించుకున్నారు. మొదటి రికార్డ్ నటుడు పాల్ న్యూమ్యాన్‌ది.

చిన్న వయసులోనే ఆస్కార్ దక్కించుకున్న నటిగా జెన్నీఫర్ లారె న్స్ 2013లో రికార్డు సాధించారు. ఆ తర్వాత ఆమె ఆస్కార్ బరిలో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా నామినేషన్ దక్కించుకున్నారు. తనతో పాటు పోటీపడుతున్న తారలందరి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నది జెన్నిఫర్ లారెన్సే అట. ఈ క్యూట్ బ్యూటీ సంపాదన ఏడాదికి 358 కోట్ల రూపాయలట. మరి... జెన్నిఫరా... మజాకానా? ఇప్పుడు జెన్నీఫర్‌తో ఆస్కార్ బరిలో నిలిచిన తారలు కేట్ బ్లాంచెట్, బ్రీ లార్సెన్, ఛార్లోట్ రాంప్లింగ్, సాయోర్స్ రోనన్‌ల సంపాదన ఏడాదికి 41 కోట్ల రూపాయలు కూడా మించడం లేదట.

2013లో ‘గ్రావిటీ’, 2014లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రాలకు గాను ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఆస్కార్ గెల్చు కున్న ఇమ్మాన్యూల్ లుబెజ్కీ ఈసారి ‘ద రెవరెంట్’ చిత్రంతో బరిలో నిలిచారు. ఈ ఏడాది కూడా ఇమ్మాన్యూల్ ఆస్కార్ దక్కించుకుంటే వరుసగా మూడుసార్లు ఆస్కార్ గెలిచి, హ్యాట్రిక్ సాధించిన కెమెరామ్యాన్‌గా చరిత్రలో నిలిచిపోతారు.

స్టీవెన్ స్పీల్‌బెర్గ్ పేరు ఈ ఏడాది ఉత్తమ దర్శకుని విభాగంలో లేకపోయినా, నిర్మాతగా ఆయన పేరు ఉత్తమ చిత్ర విభాగం బరిలో ఉంది. స్వీయ దర్శక త్వంలో ఆయన నిర్మించిన ‘బ్రిడ్జ్ ఆఫ్ ద సై్పస్’ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఇప్పటికే ఎక్కువ సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన వ్యక్తిగా స్పీల్ బెర్గ్ చరిత్రలో నిలిచిపోయారు. 1982 నుంచి  2015 వరకూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు ‘బెస్ట్ ఫిల్మ్’ కేటగిరీలో 9 సార్లు చోటు దక్కింది. దర్శకునిగా పలుసార్లు ఆస్కారందుకున్న స్పీల్‌బెర్గ్  నిర్మాతగా ఒకే ఒక్కసారి 1994లో ‘షిల్లిండర్స్ లిస్ట్’కి అందుకున్నారు. మరి.. ఈసారి ఏం జరుగుతుందో?

ఏకంగా 50 ఆస్కార్ నామినేషన్లు సాధించిన పెద్ద వయస్కుడిగా ‘స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకన్స్’ సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఈసారి కూడా నామినేషన్ల జాబితాలో ఉన్నారు. వాల్ట్ డిస్నీ ఏకంగా 59 నామినేషన్లతో చరిత్ర సృష్టిస్తే, ఆ తర్వాత స్థానంతో జాన్ తన పేరును చరితార్థం చేసుకున్నారు. ఇప్పటివరకూ జాన్ 5 సార్లు ఆస్కార్లు అందుకున్నారు. మరి, ఈసారీ ఆస్కార్ అందుకుంటారా?

అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునే వాళ్లతో ముందు రిహార్సల్ చేస్తారు. ‘అండ్ ద విన్నర్ ఈజ్...’ అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డును అందజేస్తారు. అలా చేయడంవల్ల వేడుక రోజున విజేతలుగా నిలిచేవాళ్లల్లో కొంచెం ఖంగారు తగ్గుతుందని నిర్వాహకుల ఫీలింగ్.

14 ఏళ్లుగా డాల్బీ థియేటర్‌లోనే ఆస్కార్ వేడుక జరుగుతోంది. 3,400 సీటింగ్ సామ ర్థ్యమున్న ఈ వేడుక ప్రాంగణానికి 500 అడుగుల నిడివున్న రెడ్ కార్పెట్‌పై నడుచు కుంటూ రావాలి. ఆస్కార్ స్థాయి పేరున్న ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కన్నా ఆస్కార్ అవార్డ్స్ రెడ్‌కార్పెట్ నిడివి ఎక్కువ. గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్ నిడివి 437 అడుగులే.

ఇప్పటివరకూ అత్యధిక సార్లు ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రికార్డు నటుడు బాబ్ హోప్‌కు దక్కుతుంది. 1940 నుంచి 1978 మధ్య 19 ఆస్కార్ అవార్డులకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఘనత ఆయనది. నటుడు క్రిస్ రాక్ ఈ ఏడాది హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఈసారి అవార్డులు ప్రదానం చేసే తారల్లో మన ప్రియాంకా చోప్రా ఉండటం విశేషం. మరి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్న ప్రియాంక ఈ వేడుకల్లో ఎలాంటి దుస్తులు ధరిస్తారో, విదేశీయుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.

ట్రాఫిక్ మళ్లింపు!
ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఎలాంటి పొరపాట్లూ దొర్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. అలాగే, ఇతర దేశాల నుంచి కూడా అతిథులు హాజరవుతారు. ఈ భారీ వేడుకను కవర్ చేయడానికి మీడియావాళ్లు కూడా భారీ ఎత్తున పాల్గొంటారు. ట్రాఫిక్ పరంగా ఎవరికీ ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
డాల్బీ థియేటర్ ఉన్న హాలీవుడ్, హైల్యాండ్ ఏరియాలను కనెక్ట్ చేస్తున్న ‘హాలీవుడ్ బౌలీవార్డ్’ వీధిని ఈ నెల 21 ఉదయం పది గంటల నుంచే మూసి వేశారు. మళ్లీ యథావిధిగా మార్చి 1న తెరవనున్నారు. ఆ వీధిలో నివసిస్తున్నవారికీ, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

50 బొమ్మలకు 3 నెలలు!
బంగారు రంగులో తళుకులీనే ఆస్కార్ బొమ్మకు ఈసారి కొత్త సొబగులు అద్దారు. 1920లో తయారు చేసిన ఆస్కార్ ప్రతిమను స్ఫూర్తిగా తీసుకుని, కొత్త బొమ్మను తయారు చేశారు. న్యూయార్క్‌కు చెందిన పొలిచ్ టల్లిక్స్ ఫైన్ ఆర్ట్ ఫౌండ్రీకి ఆస్కార్ బొమ్మలను తయారు చేసే బాధ్యతను అప్పగించారు నిర్వాహకులు. తొలిసారి ఈ అవకాశాన్ని దక్కించుకోవడంతో ఆ ఫౌండ్రీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రీడీ ప్రింటింగ్ విధానంలో ప్రతిమల్ని తయారు చేసింది. వేదికపై ఇవ్వనున్న సుమారు 50 ఆస్కార్ ప్రతిమల్ని తయారు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. గత 34 ఏళ్లల్లో ప్రదానం చేసిన ఆస్కార్ ప్రతిమల కన్నా ఈసారి ఇవ్వనున్న ప్రతిమ మరింత ఆకర్షణీయంగా ఉంటుందట. విజేతల వదనాల్లో కళకళలతో పాటు చేతిలో ఉన్న ప్రతిమ కూడా మిలమిల మెరిసిపోవడం ఖాయం అన్నమాట.