'మ్యాడ్ మ్యాక్స్'కు అవార్డుల పంట

29 Feb, 2016 10:20 IST|Sakshi
'మ్యాడ్ మ్యాక్స్'కు అవార్డుల పంట

లాస్ ఏంజిల్స్ :  ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ  వైభవంగా కొనసాగుతోంది.  88వ ఆస్కార్ అవార్డుల పురస్కారాల్లో ఈసారి 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. జార్జ్‌ మిల్లర్‌ దర్శకత్వం వహించిన మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం 10 నామినేషన్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. 'మ్యాడ్‌ మాక్స్‌: ఫ్యూరీ రోడ్‌'  చిత్రం కథనానికి వెళితే ఓ మహిళ, మరి కొందరు మహిళా ఖైదీలతో కలిసి చేసిన పోరాటానికి మ్యాక్స్‌ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. వారు తమ సొంత భూమిని వెదుక్కుంటూ జీవించడానికి చేసే పోరాటమే ఈ చిత్రం.

కాస్ట్యూమ్ డిజైన్‌లో జెన్నీ బీవాన్‌కు ఆస్కార్ దక్కింది. జెన్సీ బీవాన్‌కు ఆస్కార్ దక్కడం ఇదో రెండోసారి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్న కొలిన్ గిబ్సన్, లీసా థాంప్సన్ కూడా ఆస్కార్‌ను గెలుచుకున్నారు. మేకప్-హెయిర్ స్టయిల్ విభాగంలోనూ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్‌కే ఆస్కార్ దక్కింది. ఫిల్మ్ ఎడిటింగ్‌లోనూ ఫ్యూరీ రోడ్‌కు ఆస్కార్ దక్కింది. మార్గరేట్ సిక్సల్ ఆ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకున్నారు. సౌండ్ ఎడిటింగ్‌లో మార్క్ మాంగిని, డేవిడ్ వైట్‌లు ఆస్కార్లను అందుకున్నారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో క్రిస్ జెన్‌కిన్స్, గ్రెగ్ రుడాల్ఫ్, బెన్ ఓస్మో ఆస్కార్‌ను గెలుచుకున్నారు.

ఉత్తమ్‌ ఎడిటింగ్ ‌(సీక్సెల్‌)
కాస్టూమ్‌ డిజైనింగ్‌(జెన్నీ బెవన్‌)
ప్రొడక్షన్‌ డిజైనింగ్‌(కొలిన్‌ గిబ్సన్‌)
మేకప్‌, కేశాలంకరణ(లెస్లే వాండర్‌వాల్ట్‌, ఎల్కా వార్డెజ్‌)
సౌండ్‌ ఎడిటింగ్‌( మార్క్‌ మాగ్నీ, డేవిడ్‌ వైట్‌)
సౌండ్‌ మిక్సింగ్‌(క్రిస్‌ జెన్‌కిన్స్‌, గ్రిజ్‌ రడాల్ఫ్‌)