ఆస్కార్‌ పొందిన ‘పారాసైట్’ విజయ్‌ మూవీ కాపీనా..!

12 Feb, 2020 12:06 IST|Sakshi

పారసైట్‌.. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ప్రస్తుతం ఈ కొరియన్‌ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం.. తొలిసారి ఓ కొరియన్‌ చిత్రం ఆస్కార్‌ అవార్డు గెలవడం. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీచిత్రం కేటగిరీలో కూడా పురస్కారం అందుకున్న చరిత్ర లేకపోగా.. ఈ చిత్రం ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌విభాగాల్లో కూడా అస్కార్‌ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు.

అయితే ఆస్కార్‌లు తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ఓ చిత్రానికి కాపీ అంటున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  ‘మిన్సార కన్నా’కు, 'పారసైట్ ' కు చాలా సారూప్యతలు ఉన్నాయని .. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది .. ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.
 

బిలియనీర్ అయిన హీరో తన ప్రేమ కోసం హీరోయిన్‌ ఇంటిలో పనివాడుగా చేరుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పనివాళ్లుగా పెడతాడు. చివరకు తన ప్రేమను అతడు ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ‘మిన్సార కన్నా’తెరకెక్కింది. పారసైట్‌ కథను మిన్సార కన్నా నుంచి తీసుకున్నారని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు ‘పారసైట్’, ‘షాప్ లిఫ్టర్’ అనే చిత్రంను కూడా పోలి ఉందని మరికొంతమంది తమ కామెంట్లు వినిపిస్తున్నారు. 

‘పారసైట్‌’ స్టోరీ ఏంటంటే..
ఓ ధ‌నిక కుటుంబాన్ని ఓ పేద కుటుంబం తెలివిగా బోల్తా కొట్టించి వాళ్ల ఇంట్లో ప‌నిలోకి ప్రవేశిస్తుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినవారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది. ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారనియజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా ఇతివృత్తం. పేద‌, ధ‌నిక అంత‌రాల వ‌ల‌న స‌మాజంలో ఎలాంటి విపత్కర ప‌రిస్థితులు ఏర్పడుతాయో పారాసైట్ అనే చిత్రంద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు.

మరిన్ని వార్తలు