రాజకీయాల్లోకి రమ్మన్నారు

2 Mar, 2019 08:05 IST|Sakshi

తమిళసినిమా: నన్నూ రాజకీయాల్లోకి రమ్మన్నారని నటి ఓవియ చెప్పింది. ఈ కేరళా కుట్టి ఇప్పుడు వార్తల్లో హాట్‌హాట్‌గా నానుతోంది. కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయినా, అప్పట్లో అంతగా పాపులర్‌ కాలేకపోయింది. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొందో, అందులో నటుడు ఆరవ్‌తో ప్రేమ అంటూ వివాదాలకు తావిచ్చి హెడ్‌లైన్‌ వార్తల నటిగా మారిపోయింది. ఆ పాపులారిటీ  సినీరంగంలోనూ పని చేసింది. తాజాగా ఈ అమ్మడు నటించిన 90 ఎంఎల్‌ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాంశంగా మారింది. అందుకు కారణం చిత్రంలో నటి ఓవియ పోషించిన పాత్రనే. మద్యం, పొగ తాగడం వంటి సన్నివేశాల్లో నటించి ఓవియ చర్చల్లో చిక్కుకుంది.

అయితే ఇవన్నింటినీ ఈ భామ సమర్థించుకోవడం విశేషం. అసలీ అమ్మడు ఏమంటుందో చూద్దాం. పురుషాధిక్యత నుంచి బయటపడ్డ ఒక యువత స్వేచ్ఛగా జీవించాలనుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం 90 ఎంఎల్‌. మహిళా దర్శకురాలు అనిత ఈ కథను చెప్పగానే వెంటనే నటించడానికి అంగీకరించాను. ఇందులో ద్వందర్థాల సంభాషణలు, మద్యం తాగడం, పొగతాగడం వంటి సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అయితే అలాంటి అలవాట్లన్నీ నా నిజజీవితానికి సంబంధించినవి కాదు. చిత్రంలో ఒక పాత్రకు చెందిన అలవాట్లు. అందుకే ఈ చిత్రాన్ని వయసుకు వచ్చిన వాళ్లు చూస్తే చాలు అని చెబుతున్నాం. మళ్లీ ఈ తరహా పాత్రల్లో నటిస్తారా అని అడుగుతున్నారు.

అయితే ఒక్కో చిత్రంలో ఒక్కో తరహా పాత్రలో నటించాలని కోరుకునే నటిని నేను. అది నాయకి పాత్ర అయినా, ప్రతి నాయకి పాత్ర అయినా సరే. పెళ్లి గురించి అడుగుతున్నారు. అది నాకు సరిపడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి నా ఇష్టానుసారం స్వేచ్ఛగా జీవిస్తున్నాను. అయితే ఇకపై ఎం జరుగుతుందో చెప్పలేను. మనం అనుకున్నవన్నీ జరగవు కదా ఇకపోతే రాజకీయాల్లోకి వెళతారా అని అడుగుతున్నారు. ఇప్పుడికే కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు నన్ను కలిసి తమ పార్టీలో చేరమని కోరారు. అందుకు నేను నిరాకరించాను. అయితే నన్ను పార్టీలో చేరమని అడిగిందెవరన్నది చెప్పదలచుకోలేదు. కోటి రూపాయలు ఇస్తానంటే రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగితే కచ్చితంగా చేయననే చెబుతాను. నేను నటిగా కోలీవుడ్‌లో నాకంటూ ఒక స్థానాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని నటి ఓవియ పేర్కొంది.

మరిన్ని వార్తలు