'ఆ సినిమా కాస్త ఆలస్యంగా చేసుంటే బాగుండేది'

28 Nov, 2017 11:15 IST|Sakshi

ప్రముఖ నిర్మాత ఏయం రత్నంగారి తనయుడిగా సినీరంగానికి పరిచయం అయిన దర్శకుడు ఏయం జ్యోతికృష్ణ. తొలి సినిమా నీ మనసు నాకు తెలుసుతోనే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జ్యోతికృష్ణ ఈ గురువారం ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా, అనుఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, చంద్రమోహన్, అలీ, శియాజీ షిండేలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 30న రిలీజ్ అవుతున్న సందర్భంగా  జ్యోతికృష్ణ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.

హిట్ అవుతుందని తెలుసు ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి..
సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను తెరకెక్కించాం. సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే టెన్షన్ గా ఉంది.  అదే సమయంలో ఎక్సైటింగ్ గా కూడా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది.. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.. కానీ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. రచయితగా 'స్నేహం కోసం' నా తొలి చిత్రం. ఆ సినిమా పూర్తిగా భావోద్వేగాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు నా దర్శకత్వంలో అలాంటి సినిమా చేయటం ఆనందంగా ఉంది. దర్శకుడిగా నా తొలి చిత్రం నీ మనసు నాకు తెలుసు.. అప్పట్లో తెలుగు సినిమాలో ఉన్న ట్రెండ్ కు భిన్నంగా ఆ సినిమా చేశాను.. అయితే ఆ సినిమా చాలా అడ్వాన్స్డ్ గా చేశాను.. కాస్త లేట్ గా చేసి ఉంటే బాగుండేది. అందుకే ఆక్సిజన్ విషయంలో కాస్త టైం తీసుకున్నా. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తెలుగు నేటివిటి, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా.

ఈ సినిమా తరువాత గోపిచంద్ ఇమేజ్ మారిపోతుంది..
ఆక్సిజన్ సినిమా తరువాత ఆయన ఇమేజ్ మారిపోతుంది. పెద్ద స్టార్ హీరోకు సూట్ అయ్యే కథ ఆక్సిజన్. గోపిచంద్ అయితే నా కథకు సరిపోతారన్న నమ్మకంతో ఆయనతో కలిసి పనిచేశాం. మా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. ఇంత వరకు గోపిచంద్ ఎలాంటి ఇమేజ్ లో ఫిక్స్ అవ్వలేదు. అది కూడా మాకు హెల్ప్ అయ్యింది. ఇన్నాళ్లు గోపిచంద్ ను యాక్షన్ హీరోగా మాత్రమే చూశారు. ఈ సినిమాతో నటుడిగా కూడా మీరు కొత్త గోపిచంద్ ను చూస్తారు. ఆయన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి.

15 మంది సీనియర్లు కీలక పాత్రల్లో నటించారు..
దాదాపు 15 మంది సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అంతమందిని ఓకేసారి తెర మీద చూపించేందుకు చాలా కసరత్తులు చేశాం. అయితే ఒకసారి సెట్స్ మీదకు వెళ్లాక ఆడియన్స్ కు ఎలా అయితే నచ్చుతుంది అన్న ఆలోచనతోనే సినిమాను తెరకెక్కించాను. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి పాత్రకు వారి ఇమేజ్ కు తగ్గ ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే సమయంలో నటీనటులందరూ షూటింగ్ విషయంలో ఎంతో సహకరించారు. వారి సహకారం మూలంగానే అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేయగలిగాం. సీనియర్ ఆర్టిస్ట్ ల డేట్స్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని షూటింగ్ ప్లాన్ చేశాం. చిన్నతనం నుంచి సినిమాలకు పనిచేసిన అనుభవం నాకు ఈ సినిమా విషయంలో చాలా హెల్ప్ అయ్యింది. నేను చాలా వేగం గా సినిమా తెరకెక్కిస్తాను. నా మేకింగ్ స్టైల్ కారణంగా డేట్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా షూటింగ్ ముగించగలిగాం.  ముందు వెళ్లాల్సిన వారి షాట్స్ ముందుగానే తీసేయటం.. అందుకోసం ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవటం వల్ల ఇంతమంది బిజీ ఆర్టిస్ట్ లతో సినిమా చేయటం వీలైంది.

యువన్ చేసిన అన్ని పాటలు సినిమాలో వాడటం వీలుపడలేదు..
యువన్ శంకర్ రాజా నాకు సోదరుడి లాంటి వాడు. ఆయనతో ఈ సినిమా కోసం పనిచేయటం చాలా హ్యాపిగా ఉంది. కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాకు పనిచేశారు. యువన్ ఈ సినిమా కోసం ఆరు పాటలు ట్యూన్ చేశారు. అయితే కథా పరంగా అన్ని పాటలను వాడటం వీలుపడలేదు. ఆడియోలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉంటాయి. మిగిలిన పాటలను తప్పకుండా మా తదుపరి చిత్రాల్లో వినియోగిస్తాం. బిజీ షెడ్యూల్ కారణంగా యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం చేయలేకపోయారు. ఇళయరాజా షోస్ కారణంగా  ఫారిన్ లో ఉన్న యువన్ అక్కడే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తా అన్నారు. కానీ నేను పక్కనే ఉండి చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడే చిన్నాతో చేయించాను. కేవలం నేపథ్య సంగీతం కోసం రెండున్నర నెలల సమయం పట్టింది. అదే సమయంలో గ్రాఫిక్స్ కారణంగా కూడా సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. దాదాపు 9 నెలలలపాటు గ్రాఫిక్స్ వర్క్ జరిగింది. క్వాలిటీ కోసమే అంత సమయం తీసుకున్నాం.

ఏదో పొరపాటున నటించా..
అప్పట్లో ఏదో పొరపాటుగా ఓ సినిమా చేశాను. భవిష్యత్తులో నటుడిగా కొనసాగే ఆలోచనలేదు. ప్రస్తుతానికి నా దృష్టంతా దర్శకత్వంపైనే ఉంది. అదే సమయంలో నిర్మాణ రంగంలోనూ బిజీ అవ్వాలని భావిస్తున్నా. నాన్నగారి వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలు కూడా నామీదే ఉన్నాయి. ఒక సినిమా విజయానికి నిర్మాత, దర్శకుడే కారణమని నా నమ్మకం. నాన్నగారు నిర్మాతగా తెరకెక్కే సినిమాలకు నా వంతుగా నేను సాయం చేస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా ఆక్సిజన్ రిలీజ్ మీదే ఉంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే నా తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకుంటా. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా