గిన్నీస్‌లో గాన కోకిల

29 Mar, 2016 23:19 IST|Sakshi
గిన్నీస్‌లో గాన కోకిల

ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో కొత్త రత్నం వచ్చి చేరింది. ఇప్పటికి ఆరు దశాబ్దాల పైగా దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురా లైన ఈ గానకోకిల పేరు తాజాగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కారు. ‘‘2016 జనవరి 28 నాటికి ధ్రువీ కరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి  6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారు’’ అని గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు.
 
  1952లో తమిళ చిత్రం ‘పెట్రతాయి’ (తెలుగులో ‘కన్నతల్లి’) ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన ఆమె ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అంతటి ఈ ‘గాన సరస్వతి’కి భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవిం చాయి.
 
 ‘ఝుమ్మంది నాదం...’ (చిత్రం ‘సిరిసిరి మువ్వ’), ‘ప్రియే చారుశీలే...’ (చిత్రం ‘మేఘ సందేశం’) సహా వివిధ గీతాలు పాడినందుకు గాను ఇప్పటికి 5సార్లు ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఆమెను జాతీయ అవార్డులు వరించాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషాసీమల రాష్ట్రప్రభుత్వ సినీ అవార్డులు వెతు క్కుంటూ వచ్చాయి. కొంత కాలంగా సినీ నేపథ్య గానానికి దూరంగా ఉన్న ఆమె ఎనిమి దేళ్ళుగా ‘పి. సుశీల ట్రస్ట్’ ద్వారా అవసరంలో ఉన్న సంగీత కళా కారుల్ని ఆదుకుంటూ వస్తున్నారు.
 
 నాకు పలు జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ, ఇప్పుడిలా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కడం మాత్రం వినూత్నమైన అనుభూతి. ఇది గ్రేటే. ఎందుకంటారా? ఈ అరుదైన ఘనత అందరికీ దక్కదు కదా! పైగా, ఏవేవో సిఫార్సులు, పైరవీలు చేస్తే ఇది వచ్చేది కూడా కాదు. నిజానికివాళ ఉదయమే శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చా. ఇంటికి వచ్చేసరికి పోస్ట్‌లో గిన్నీస్‌బుక్ వారి నుంచి ఈ సర్టిఫికెట్ వచ్చి ఉంది. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందుకే, ఈ విషయాన్ని సంగీతప్రియులతో, నా అభిమానులతో పంచుకోవాలనుకున్నా. నిజానికి, ఈ ఘనత నాది కాదు. నన్ను ఆదరించిన సినీ పరిశ్రమది.
 
  నన్ను అభిమానించిన ప్రేక్షకులది. అమెరికా, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న నా వీరాభిమానులు ఏడుగురు నా పేరు మీద వెబ్‌సైట్ పెట్టి, నేను పాడిన పాటలన్నీ సేకరించి, అందులో అప్‌లోడ్ చేశారు. ఆ ఏడుగురిలో ఇద్దరు మహిళాఫ్యాన్స్. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) ఎన్నేసి పాటలు పాడానో, డేటా అంతా వాళ్ళు సేకరించారు. గిన్నీస్ వాళ్లు 1960 నుంచి పాటలు తీసుకున్నారు.
 
  కానీ, 1951 నుంచే పాటలు పాడాను. అవీ కలిపితే, పాతికవేలు దాటేస్తాయి. ఇక, ప్రైవేట్ భక్తిగీతాలు కొన్ని వేలున్నాయి. కొద్ది నెలల క్రితమే ‘బొమ్మల రామారాం’ అనే సిన్మాలో పాడాను. ఇప్పటికీ దర్శక, నిర్మాతలు పాడించాలనుకుంటే నేను రెడీ. (నవ్వుతూ) ఐనా, కొత్త సింగర్స్‌కీ ఛాన్స్ ఇవ్వాలి కదా!
 - ‘సాక్షి’తో ‘పద్మభూషణ్’ పి. సుశీల