రాకాసులతో రోబోల పోరాటం

10 Jul, 2013 03:47 IST|Sakshi
రాకాసులతో రోబోల పోరాటం
సముద్రగర్భంలో ఏర్పడిన పెనువిపత్తు... ఆ అగాథంలో దాగివున్న వెయ్యి అడుగుల రక్తరాకాసులు భూమిపైకి రావడానికి కారణమైంది. మానవజాతిని నిర్వీర్యం చేసే దిశగా సాగిపోతున్న ఆ రాకాసుల ఆటకట్టించడానికి అమెరికన్ ఆర్మీ... ఆ రాకాసులకంటే శక్తిమంతమైన రోబోలను తయారు చేసింది. మానవ మస్తిష్కానికి ధీటైన మేథస్సును ఈ రోబోల్లో అమర్చింది అమెరికన్ ఆర్మీ. 
 
 వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న రోబోలు, అదే పరిమాణంలో ఉన్న ఆ రక్తరాకాసులపై ఎలా తలపడ్డాయి. ఈ భీకరపోరులో విజయం ఎవరిది? ఈ ఆసక్తికరమైన ఫాంటసీ కథాంశంతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘పసిఫిక్ రిమ్’. గులెర్మో డేల్‌టోరో దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘అంతిమ పోరాటం’ పేరుతో గోగినేని బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 
 
 ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘అవతార్ చిత్రానికి దీటైన సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం ఉంటుంది. రక్తరాకాసులకు, రోబోలకు మధ్య జరిగే విధ్వంసకాండ కళ్లు చెదిరే స్థాయిలో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలలో 2డి, 3డి వెర్షన్‌లతో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. చార్లీ హున్నమ్, ఇడ్రిస్ ఇల్లా, చార్లీడే, రాబ్ కజిన్‌స్కై, మ్యాక్స్ మార్టిన్ ఇందులో ముఖ్య పాత్రధారులు.