‘పద్మావతి’  పేరు మార్పు?!

30 Dec, 2017 18:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌ లీలా బన్సాలీ భారీ సెట్టింగ్‌లతో తీసిన వివాదాస్పద బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెల్సింది. అలాగే సినిమా పేరును కూడా ‘పద్మావత్‌’గా మార్చాలని సెన్సార్‌ బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు సభ్యులకు చూపించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన అర్వింద్‌ సింగ్, జైపూర్‌ యూనివర్శిటీకి చెందిన చంద్రమణి సింగ్, కేకే సింగ్‌లతో కలిసి సెన్సార్‌ బోర్డు ప్యానెల్‌ ఈ చిత్రాన్ని తిలకించి కొన్ని కత్తిరింపులతో యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెల్సింది.
 
దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ నటించిన ఈ చిత్రానికి 26 కట్‌లను సెన్సార్‌ బోర్డు సూచించినట్లు ‘న్యూస్‌ 18’ ఛానెల్‌ వెల్లడించింది. జైపూర్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెల్సింది. సెన్సార్‌ బోర్డు సభ్యుల సూచనలను పాటిస్తామని సినిమా నిర్మాతలు హామీ ఇచ్చినట్లయితేనే సినిమా విడుదలకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ మంజూరు చేస్తారు. సర్టిఫికేట్‌ ఇచ్చేముందు ప్యానెల్‌ మరోసారి సమావేశమై చర్చిస్తుందని సెన్సార్‌ బోర్డు వర్గాలు వెల్లడించగా, సినిమా నిర్మాతలు మీడియాతోని మాట్లాడేందుకు నిరాకరించారు.

మరిన్ని వార్తలు