నటి కన్నుమూత.. కొడుకు జాడలేదు

26 May, 2018 16:04 IST|Sakshi

సాక్షి, ముంబై: దుర్భర పరిస్థితులను ఎదుర్కున్న అలనాటి బాలీవుడ్‌ నటి గీతా కపూర్‌(57) ఇక లేరు. శనివారం ఆమె ఉంటున్న వృద్ధాశ్రమంలో కన్నుమూసినట్లు ఫిల్మ్‌మేకర్‌- సీబీఎఫ్‌సీ సభ్యుడు అశోక్‌ పండిట్‌ వెల్లడించారు. ‘మేం​ ఆమెను మాములు మనిషిని చేయాలని యత్నించాం. కానీ, కొడుకు-కూతురు గురించి ఆలోచించి ఆమె రోజురోజుకీ కుంగిపోయారు. ఏడాదిగా వారి జాడ కోసం మేం చెయ్యని యత్నంలేదు. అనారోగ్యంతో చివరకు ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని కూపర్‌ ఆస్పత్రిలో ఉంచాం. వారి పిల్లలు, బంధువులు వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని పండిట్‌ చెబుతున్నారు. 

పాకీజా వంటి క్లాసిక్‌ చిత్రంలో నటించిన(రాజ్‌కుమార్‌ రెండో భార్య పాత్రలో) గీతా కపూర్‌ను అనారోగ్యం కారణంగా గతేడాది మే నెలలో తనయుడు ముంబై గోరేగావ్‌లోని ఎస్‌వీఆర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపై డబ్బు తేవాలంటూ ఏటీఎంకు వెళ్లిన అతను అటునుంచి అటే పారిపోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఆపై మీడియా కథనాల ఆధారంగా ఆమె దుస్థితి గురించి తెలుసుకున్న అశోక్‌ పండిట్‌ ఆ  బిల్లులను చెల్లించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. తల్లి మరణం నేపథ్యంలో ఇప్పటికైనా వారు తిరిగొస్తారని వృద్ధాశ్రమంలోని ఆమె సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమె మీడియాతో చెప్పిన మాటలు... 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. కానీ, ఇప్పుడు నా కొడుకు నాక్కావాలి. ఒక్కసారి చూడాలని ఉంది' అని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు