షారుఖ్‌ ట్రైలర్‌పై 'పాక్‌' ఆర్మీ చిందులు!

24 Aug, 2019 15:57 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇటీవల వెబ్‌ సిరీస్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌పై పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్‌ చిందులు తొకుతున్నారు. ఈ ట్రైలర్‌పై గఫూర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘మీరు ఇంకా బాలీవుడ్ భ్రమలోనే బతుకుతున్నారు. వాస్తవికత(రియాలిటీ) చూడాలంటే ‘రా’ గూఢాచారి కుల్భూషణ్ జాదవ్, వింగ్ కమాండర్ అభినందన్, 27 ఫిబ్రవరి 2019న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వివాదాన్ని గమనించండి. మీరు జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తి.. శాంతిని ప్రోత్సహించాలి. నాజీలుగా మారిన హిందుత్వ ఆరెస్సెస్‌ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బావుంటుంది’ అని పేర్కొన్నారు. 

గూఢచర్యం నేపథ్యంతో వస్తున్న ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’లో ఇమ్రాన్ హష్మీ, వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాల (గూఢాచారి ఫేమ్‌) ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. బిలాల్ సిద్దిఖీ రాసిన పుస్తకం ఆధారంగా  ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందించబడింది. ‘మా మొదటి నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ బార్డ్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గూఢచర్యం, ప్రతీకారం, ప్రేమ, విధి నిర్వహణల మధ్య సాగే ఓ ఉత్కంఠభరితమైన కథ’ అని షారుఖ్‌ ఈ ట్రైలర్‌ను పరిచయం చేస్తూ ట్వీట్‌ చేశారు. ట్రైలర్ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌తో ప్రారంభమవుతుంది. అక్కడ భారత గూఢాచారులు ఒక ముఖ్యమైన సమాచారాన్ని భారతదేశానికి చేరవేయడానికి ముందే పట్టుబడి శిరచ్ఛేదనంతో ప్రాణాలు కొల్పోతారు. గూఢాచారి ‘కబీర్ ఆనంద్ అలియాస్‌ అడోనిస్’ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు.

అనుకోని పరిస్థితుల నడుమ గూఢాచారిగా మారిన కబీర్, ఆ తర్వాత ముంబైలో ప్రొఫెసర్‌ అవతారం ఎత్తి జీవితాన్ని గడిపేస్తుంటాడు. దేశాన్ని కాపాడటానికి బలూచిస్తాన్‌కు వెళ్ళమని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అతనికి ఊహించనిరీతిలో పిలుపు వస్తుంది. దీంతో శోభితా ధూలిపాల, వినీత్ కుమార్ సింగ్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో భాగాంగా పాకిస్థాన్‌కు బయలుదేరతారు. రెస్క్యూ కమ్ సూసైడ్ మిషన్‌లొ ఈ ముగ్గురు గూఢాచారులు చేసిన ఉత్కంఠభరిత ప్రయాణమే ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’. శోభితా ధూళిపాల వర్ధమాన నటి, మోడల్, తెలుగమ్మాయి. తెనాలిలో జన్మించారు. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో రెండోస్థానంలో నిలిచిన ఆమె, మిస్ ఎర్త్ 2013లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వార్తలు