పంగా రివ్యూ: ప్రతి ఒక్కరూ చూడాల్సిందే

24 Jan, 2020 11:49 IST|Sakshi

బాలీవుడ్‌ సంచలన హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజా చిత్రం ‘పంగా’.  ఈ చిత్రంలో ఆమె మహిళా కబడ్డీ మాజీ చాంపియన్‌ జయ నిగమ్‌ పాత్రను పోషించారు. అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వం వహించిన పంగాలో జస్సీ గిల్‌, రిచా చద్దా, నీనా గుప్తా, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌తో మంచి మార్కులు కొట్టేసిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఇక ఇదే రోజు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ నటించిన స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ విడుదలైంది. ఈ నేపథ్యంలో పంగా బాక్సాఫీస్‌ దగ్గర గెలుస్తుందా? లేదా అనేది చూద్దాం...

కథ: ఇది ఓ మహిళా కబడ్డీ క్రీడాకారిణి జయ నిగమ్‌ బయోపిక్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ బంధాలను, ఆశయాలను ఒకే తాటిపైకి తేవడం సాధ్యమేనా అన్న అంశాన్ని దర్శకురాలు చాలా చాకచక్యంగా తెరకెక్కించారు. ఇక పెళ్లికి ముందు యువతి ఎలా ఉన్నా వివాహం అనంతరం ఆమె బరువు బాధ్యతలు తలకెత్తుకోక తప్పదు. అందులోనూ జయ నిగమ్‌ (కంగనా రనౌత్‌) బ్యాంకు ఉద్యోగి. అయితే జాతీయ అవార్డు అందుకున్న జయ పెళ్లికి ముందు అందరి చేత నీరాజనాలు అందుకుంటుంది. కానీ గృహిణిగా మారిన తర్వాత కనీసం గుర్తింపు కూడా కరువవుతుంది. దీంతో ఆమె మనసు మరోసారి కబడ్డీ వైపు మళ్లుతుంది. భారత్‌ తరపున అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌ గెలవాలని కలలు కంటుంది. ఆ లక్ష్యం నెరవేరిందా? దానికోసం ఆమె ఎన్ని పాట్లు పడింది? ఈ క్రమంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందా? లేదా అటు కుటుంబాన్ని, ఇటు తన కబడ్డీ ప్రాక్టీస్‌ను ఎలా సమతుల్యం చేసిందనేది సినిమా చూస్తేనే కిక్కుంటుంది.

విశ్లేషణ: అద్భుతమైన కథకు ఎలాంటి కృత్రిమ రంగులద్దకుండా నేర్పుగా తెరకెక్కించారు దర్శకురాలు అశ్వినీ అయ్యర్‌. కథలో అనూహ్య మలుపులు, థ్రిల్స్‌, కొసమెరుపులు పెద్దగా కనిపించవు. కథ ఆసాంతం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను తనవెంట తీసుకుపోతుంది. ఇక మధ్యతరగతి బంధాలను, వారి జీవితాలను కూడా తెరపై హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. జయ తన జీవితంలో మరోసారి కబడ్డీ వైపు అడుగులు వేసే కీలక సన్నివేశాన్ని డ్రమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు.

జయ కబడ్డీ ఆడాలన్న నిర్ణయాన్ని తొలుత ఆమె తల్లే వ్యతిరేకిస్తుంది. కానీ స్నేహితురాలు, స్కౌట్‌ మీను (రిచా చద్దా) ప్రోత్సాహంతో లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఇక్కడే అసలు కథ మొదలువుతుంది. ఓ గృహిణిగా, క్రీడాకారిణిగా ఆమె రెండింటినీ బ్యాలెన్స్‌ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ఆమె భర్త ప్రశాంత్‌(జస్సీ గిల్‌) ఆమె ఆశయానికి వత్తాసు పలకడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అయితే అటు ఇంటి పనులను, ఇటు పిల్లలను చూసుకోవాలంటే ఆయన తలప్రాణం తోకకొస్తుంది. మరోవైపు జయ తాను కోల్పోయిన ఫిట్‌నెస్‌ను సాధించునేందుకు పరుగు మొదలుపెడుతుంది. ఓవైపు ఎమోషనల్‌గా, మరోవైపు కబడ్డీ పోరాట సన్నివేశాల్లోనూ కంగనా విశేషంగా ఆకట్టుకుంది.

కబడ్డీ గురించి చెప్పాలంటే అది గ్రామీణ క్రీడ. ఒక్కసారి కూత మొదలుపెట్టి కాలు కదిపారంటే ప్రత్యర్థిని ఓడించే రావాలన్న కసిగా కదన రంగంలోకి దూకుతారు. ఈ క్రమంలో వారికి గాయాలైనా దాన్ని పట్టించుకోరు. కబడ్డీ చూడటానికి కాస్త హింసాత్మకంగా కనిపించినా ఆద్యంతం ఆసక్తికరంగా, మరింత రసవత్తరంగా సాగుతుంది. ఈ కబడ్డీ పోరే సినిమాకు ప్రధాన ఆయుధం. దాన్ని దర్శకురాలు సినిమాకు సంపూర్ణంగా వినియోగించుకుంది. జయ కబడ్డీ కోర్టులో ప్రత్యర్థులను మట్టి కరిపించే దృశ్యాలు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మహిళలు తప్పక చూడాల్సిన సినిమా అని పలువురు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును హత్తుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: పంగా ట్రైలర్‌

వచ్చెయ్‌నా అమ్మా?: కంగనా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా