సగం పారితోషికం ఇచ్చేయాలి

23 Feb, 2020 02:40 IST|Sakshi

– త్రిషకు నిర్మాత టి. శివ హెచ్చరిక

‘‘స్టార్‌ హీరోలతో తీసే సినిమాల ప్రచార కార్యక్రమాలకు హీరోయిన్లు రాకపోయినా ఫర్వాలేదు. హీరోని బట్టి ప్రమోషన్‌ వచ్చేస్తుంది. అయితే కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్‌ సినిమా తీసినప్పుడు దానికి కావల్సినంత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత ఆ హీరోయిన్‌దే’’ అన్నారు తమిళ నిర్మాత టి. శివ. త్రిష నటించిన తమిళ చిత్రం ‘పరమపద విళయాట్టు’కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఆ కార్యక్రమానికి త్రిష హాజరు కాకపోవడంతో టి. శివ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నూతన దర్శకుడు తిరుజ్ఞానం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న టి. శివ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా దర్శకుడు తిరుజ్ఞానం నా స్నేహితుడు. ఎంతో కష్టపడి తీశాడు. నేనింకా సినిమా చూడలేదు. కానీ రషెస్‌ చూసినవాళ్లందరూ బాగుందన్నారు. హీరోలు లేకుండా తను ఈ సినిమా చేశాడు. అందుకని ప్రమోషన్‌ చేయాల్సిన బాధ్యత హీరోయిన్‌ మీద ఉంది. కానీ రాలేదు. ఒకవేళ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఆమెకు విలువైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చు. కానీ 28లోపు జరిగే ప్రమోషనల్‌ కార్యక్రమాలకు తను కచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఈ సినిమాకి తీసుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చేయాలని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నా. ఇది ఇతర స్టార్స్‌కి కూడా కనువిప్పులా ఉంటుంది’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు