అందుకు నేనే ఓ ఉదాహరణ: హీరోయిన్‌

31 Oct, 2018 12:04 IST|Sakshi

ముంబై : బాల్యంలో జరిగే అత్యాచారాలు బాధితులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి... అందుకు తానే ఓ ఉదాహరణ  అంటున్నారు హీరోయిన్‌ పార్వతి. అంతేకాదు అటువంటి సంఘటనలు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. దక్షిణాది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఇర్ఫాన్‌ ఖాన్‌ సినిమా ‘కరీబ్‌ కరీబ్‌ సింగిల్‌’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో జరిగిన మామీ ఫిలిం ఫెస్టివల్‌కి పార్వతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మట్లాడుతూ.. ‘నేను ఈరోజు ఇక్కడ కూర్చుంది ఓ మనిషిగా. నువ్వు మహిళవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావంటూ నాపై ముద్ర వేసే అవకాశం ఉంది. అయినా ఫర్లేదు. ఎందుకంటే బాధితుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏమీ తెలియని వయస్సులో జరిగిన వాటి గురించి ఇప్పుడెలా తెలిసిందోనని వ్యంగ్యమాడే ప్రబుద్ధులు కూడా ఉంటారు. పర్లేదు. మూడేళ్ల ప్రాయంలో నాపై జరిగినవి అకృత్యాలు అని తెలుసుకోవడానికి నాకు పన్నెండేళ్లు పట్టింది. ఈ విషయం తెలిసిన నాటి నుంచి నా మనశ్శాంతి దూరమైంది. దాడి జరగడం అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు. ఆ దాడి తాలూకు చేదు ఙ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. నేను రోజూ వాటితో పోరాడుతూనే ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకునే తాను ఈ విషయంలో మాత్రం ఏళ్లపాటు ఎలా సైలెంట్‌గా ఉన్నానో తనకే అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చారు.( చదవండి : #మీటూ : ‘అతడి మీద అసహ్యంతో డెటాల్‌ తాగేశా’)

మరిన్ని వార్తలు