'నిజంగా నన్ను పవన్ కల్యాణ్ కొట్టలేదు'

19 Mar, 2016 20:03 IST|Sakshi
'నిజంగా నన్ను పవన్ కల్యాణ్ కొట్టలేదు'

హైదరాబాద్‌: 'నిజంగా పవర్ స్టార్ నన్ను కొట్టలేదు. అవన్నీ ఒట్టి రూమర్లు.. ఇక ప్రచారం చేయడం మానుకోండి' అంటూ వాపోతున్నాడు కమెడియన్ షకలక శంకర్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ లో ఉండగా కమెడియన్ షకలక శంకర్ని చెంపదెబ్బ కొట్టాడన్న వార్త గత రెండు రోజులుగా సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ కి ఆలస్యంగా రావడమే కాకుండా దర్శకుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా పవన్.. శంకర్ మీద చేయి చేసుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం స్వయంగా శంకరే వివరణ ఇచ్చుకున్నాడు.

తన అభిమాన హీరోతో కలిసి సెట్లో చాలా ఎంజాయ్ చేశానని,  అసలు ఏ గొడవా జరగలేదని చెప్పాడు. తను వండిన చేపల పులుసు అంటే పవన్ కల్యాణ్ కు ఇష్టమని, అలాగే తనతో జానపద గీతాలు కూడా పాడించుకుంటూ ఉంటారని పవన్ తో తన అనుబంధాన్ని  పంచుకున్నాడు షకలక శంకర్.