శ్రీరెడ్డి అలా చేయడం సరికాదు: పవన్‌

14 Apr, 2018 17:13 IST|Sakshi
శ్రీరెడ్డి నిరసన(పాత ఫొటో), కథువా, ఉన్నావ్‌ ఘటనలపై పవన్‌ కల్యాణ్‌ నిరసన(తాజా ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: నటి శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన, లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోల వ్యవహారంపై జన సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎట్టకేలకు స్పందించారు. శ్రీరెడ్డి అలా(అర్ధనగ్న నిరసన) చేయడం సరికాదని, ఏదైనాసరే చట్టబద్ధంగా ముందుకు వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలను నిరసిస్తూ శనివారం నెక్లెస్‌రోడ్డు వద్ద జనసేన చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘శ్రీరెడ్డి వ్యవహరించిన తీరు ముమ్మాటికీ సరికాదు. ఏదైనా వివాదం ఉంటే, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, టీవీ ఛానెళ్లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు లీక్‌ చేయడంకాదు.. అయినా మీడియాలో ఎంతమాట్లాడినా ఒక మెసేజ్‌ వెళుతుంది కానీ అంతకంటే ఉపయోగం ఉండదు. కేవలం సెన్సేషనలిజం తప్ప సాధించేది లేదు. ఇలా చేస్తే వాళ్లకూ ఇబ్బందులు తలెత్తుతాయి’’  అని పవన్‌ అన్నారు.

గతంలో చేసిన ఫిర్యాదులు ఏమయ్యాయి?: శ్రీరెడ్డి నిరసనను తప్పుపట్టిన పవన్‌కు మహిళా విలేకరుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీడియా: ‘సార్‌.. మీరేమో చట్టపరంగా వెళ్లాలంటున్నారు. కానీ గతంలో చలపతిరావు వ్యాఖ్యాల దగ్గర్నుంచి చాలా వివాదాల్లో పోలీసు కేసులు నమోదయినా చర్యలు తీసుకోలేదుకదా?’
పవన్‌:‘‘అవును, అలాంటప్పుడిక ఏం చేస్తాం? మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’’

మీడియా: ‘మరి అలా చూస్తే శ్రీరెడ్డి కూడా న్యాయం కోసమే రోడ్డుపైకి వచ్చానన్నారు కదా.. చాలా రోజుల నుంచి మీ మద్దతు కూడా ఆమె కోరారు కదా..’
పవన్‌: ‘‘సరే, నేను ఆమెకు మద్దతు ఇచ్చాననుకోండి, ఏం జరుగుతుంది? నేనేమైనా పోలీసునా, లాయర్‌నా, ఎవరైనాసరే చట్ట ప్రకారం ముందుకెళ్లాలి’’
పవన్‌: ‘‘ఇండస్ట్రీలో పరిస్థితులు నాకు కూడా తెలుసు. షూటింగ్స్‌ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు చాలామంది అభిమానులొచ్చి, ఆడపిల్లలపై పడుతున్నప్పుడు నేనే కర్ర పట్టుకుని తరమాల్సిన సందర్భాలున్నాయి. ‘తమ్ముడు’ షూటింగ్‌ అప్పుడైతే బీహెచ్‌ఈఎల్‌లో పెద్ద వివాదమే జరిగింది. ఇలాంటివి పరిష్కరించడం మనందరి సమిష్టి బాధ్యత. న్యాయం ఎందుకు జరగట్లేదని అడగాలి. కానీ టీఆర్పీ రేటింగ్స్‌ కోసం చేయకూడదు’’

మీడియా: ‘టీఆర్పీ కాదు సార్‌.. వాళ్ల ఇష్యూస్‌ని రేజ్‌ చేస్తున్నాం’
పవన్‌: ‘కరెక్టే, మీరు పోలీస్‌ స్టేసన్లకు వెళ్లి నిలబడితే, అలాంటి సంఘాలేవైనా ఆమెకు అండగా నిలబడితే సరే, లేదంటే ఇష్యూ పక్కదారిపట్టే ప్రమాదం ఉంటుంది’’
ఆతర్వాత ఆ మహిళా విలేకరిని పక్కకి వెళ్లిపోవాలని పవన్‌ అభ్యర్థించారు.

కేసీఆర్‌, చంద్రబాబులూ ఖండించాలి: కథువా, ఉన్నావ్‌లలో చోటుచేసుకున్న ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఆయా కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలని, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు దక్షిన భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులూ దీనిని ఖండించాలని పవన్‌ అన్నారు. బాధితులకు అండగా ఉండనట్లైతే రాజ్యాంగం గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్న వ్యర్ధమేనని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు