నిజమే... పవన్‌కల్యాణ్ పాట పాడారు!

2 Aug, 2013 00:20 IST|Sakshi
నిజమే... పవన్‌కల్యాణ్ పాట పాడారు!
దేవిశ్రీ ప్రసాద్ పాటంటే...
 సముద్రాన్ని సోడా బుడ్డీలో నెట్టేయడమే.
 మెరుపుతో బెడ్‌ల్యాంప్ వెలిగించాలనుకోవడమే.
 ఎగ్జాగరేషన్ అనుకున్నా పర్లేదు కానీ...
 నిజంగా తనది పరవళ్లు తొక్కే ప్రతిభే. 
 అతనిలో కనిపించే జోష్...  అతని పాటల్లోనూ క(వి)నిపిస్తుంది.
 ఇంత ఎనర్జీని ఈ ఐదు నిమిషాల పాటలో 
 ఎలా సరిపెట్టేశాడా అనిపిస్తుంది.
 దేవీ అంతే! మెరుపు వేగంతో ఇట్టే అల్లుకుపోతాడు.
 ఈ 14 ఏళ్లలో 50కి పైగానే సినిమాలు చేశాడు. 
 ఎక్కువ శాతం మ్యూజికల్ హిట్సే. ఏ తరహా పాట 
 చేసినా తన సిగ్నేచర్ కనిపిస్తుంది. లేటెస్ట్‌గా తను చేసిన
 ‘అత్తారింటికి దారేది’  ఓ మ్యూజికల్ సెన్సేషన్. 
 ఆ పాటల గురించి, అందులో చేసిన ప్రయోగాల గురించి 
 దేవితో స్పెషల్‌గా జరిపిన సంభాషణ...
 
 త్రివిక్రమ్ బేసిగ్గా రైటర్. మీలోనూ మంచి రైటర్ ఉన్నాడు. మరి మీ మ్యూజిక్ సిట్టింగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయి...
 మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నారు. రేంజ్‌లు పక్కన పెడితే, అసలు మాకు మ్యూజిక్ సిట్టింగ్సే ఉండవు. ఆయన కథ చెబుతుంటే, నేను ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ట్యూన్స్ అనేసుకుంటుంటాను. అసలు ఆయనతో భేటీనే చాలా సరదాగా ఉంటుంది. మా ఇద్దరికీ ఏం కావాలనే విషయంలో ఓ క్లారిటీ ఉంది. ‘జల్సా’లో ‘సరిగమ పదనిస కరోకరో జర జల్సా’ పాటను జస్ట్ అలా ఫోన్‌లో చెబితే వెంటనే ఓకే చెప్పేశారు. మన మీద నమ్మకం పెట్టే దర్శకులుంటే, పనిలో ఓ కిక్ ఉంటుంది. 
 
 పవన్‌కల్యాణ్‌తో మీరు చేసిన ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్’ మ్యూజికల్ హిట్స్. ఆయన సినిమా అంటే మీరు ప్రత్యేక శ్రద్ధ పెడతారనిపిస్తుంది...
 నాకు అన్ని సినిమాలూ స్పెషలేనండీ. అయితే కల్యాణ్‌గారిలో ఉన్న స్పెషాల్టీ ఏంటంటే - ఎలాంటి మ్యూజిక్‌కైనా ఆయన సెట్ అయిపోతారు. ఆయనకున్న ఫాలోయింగ్, చిత్రమైన బాడీ లాంగ్వేజ్ వల్లనే అది సాధ్యమయ్యిందేమో.
 
 ఇందులో పవన్‌కల్యాణ్‌తో ఏదో పాట పాడించారట?
 అవును. మీకెలా తెలిసింది? ఆయనతో సరదాగా ఓ బిట్ సాంగ్ పాడించాం. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేద్దామని, దాన్ని ఆల్బమ్‌లో చేర్చలేదు.
 
 హీరో కేరెక్టరైజేషన్‌ని ఆవిష్కరించే ‘ఆరడుగుల బుల్లెట్’లాంటి బరువైన పాటను శ్రీమణి అనే కొత్త రచయితతో రాయించడం సాహసం అనుకోలేదా?
 శ్రీమణి హైలీ టాలెంటెడ్. మాకేం కావాలో అది ఇచ్చాడు. ‘100%’ లవ్’ సినిమా సమయంలో దర్శకుడు సుకుమార్ తనని నాకు పరిచయం చేశారు. ‘అహో బాలూ’, ‘దటీజ్ మహాలక్ష్మి’ పాటలు తనే రాశాడు.
 
  నా ‘సారొచ్చారు’లో కూడా పాట రాశాడు. త్రివిక్రమ్‌గారు కూడా తన పాటలు విన్నారు. ఇంతకూ ‘ఆరడుగుల బుల్లెట్’ అనే కాయినింగ్ ఎవరిది?
 త్రివిక్రమ్ కథ చెబుతున్నప్పుడే ఆ కాయినింగ్ తట్టింది. దాన్ని ట్యూన్‌గా పాడితే త్రివిక్రమ్‌గారికి వెంటనే నచ్చేసింది.
 
 దాన్ని సినిమా టైటిల్‌గా రిజిస్టర్ చేశారు తెలుసా?
 (నవ్వేస్తూ) నేనే చేయమన్నాను. ట్రయిలర్ లాంచ్ టైమ్‌లో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌గారికి మంచి టైటిల్ అవుతుంది, రిజిస్టర్ చేయమని చెప్పాను. నా పాటల్లో చాలా పదాలు సినిమా టైటిల్స్‌గా వచ్చాయి కదా. కెవ్వు కేక, గుండెజారి గల్లంతయ్యిందే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా చాలా టైటిల్స్ వచ్చాయి. 
 
 ‘నిన్ను చూడగానే’ పాటలో ‘అత్తలేని కోడలుత్తమురాలు’ అనే పాత పాటను వాడాలని ఎందుకనిపించింది?
 అది త్రివిక్రమ్ ఆలోచనే. సినిమా చూస్తే, దాన్ని ఎందుకు ఉపయోగించామో తెలుస్తుంది.
 
 ఈ పాటను మీరే రాశారు కదా. మీరెప్పుడో రాసుకున్నది ఇలా ఉపయోగించుకున్నారా?
 అంత లేదండీ. నా దగ్గర అంత బ్యాంక్ కూడా ఉండదు. అన్నీ స్పాంటేనియస్సే. కథ వింటున్నప్పుడే టకటకా ట్యూన్లు పుట్టుకొచ్చేస్తుంటాయి. దానికి డమ్మీ లిరిక్స్ ఏవో అనుకుంటూ ఉంటాను. ‘అత్తారింటికి దారేది’ కథను స్పెయిన్‌లోని బార్సిలోనాలో విన్నాను. ఓ సందర్భానికి ఏం పాట చేద్దామా అని ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, సడన్‌గా ఈ పాట పుట్టింది. దీన్ని సరదాగా త్రివిక్రమ్ గారికి వినిపించి ‘‘మన సినిమాకు పని చేయదు లెండి’’ అన్నాను. ‘‘లేదు లేదు... ఇది సెకండాఫ్‌లో పనికొస్తుంది. ముందు మొత్తం పాట రాసేయండి’’ అని చెప్పారు. దాంతో నేనే రాసేయాల్సి వచ్చింది. ‘జులాయి’లో ‘ఓ మధు’ పాటను కూడా ఇలాగే నాతో రాయించారు.
 
 చాలా లో పిచ్‌లో, మంద్రంగా ఈ పాటను పాడారెందుకని?
 అలాంటి యాటిట్యూడ్‌తో పాడ్డం వల్లనే ఆ పాటకు ఇంత క్రేజొచ్చింది. అయినా కల్యాణ్‌గారి మీద ఏ పాట అయినా బావుంటుంది.
 
 ‘దేవదేవం భజే’ పాట ఈ ఆల్బమ్‌లో అద్భుతమైన కంపోజిషన్‌లా అనిపించింది... ఆ థాట్ ఎవరిది?
 సినిమాలో ఒక డాన్స్ క్లాస్ సీన్ కోసం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాడిన ‘దేవ దేవం’ అనే అన్నమాచార్య కీర్తన వాడదామా అన్నారు త్రివిక్రమ్. మొత్తం వాడేకన్నా, మొదటి రెండు లైన్లు ఉపయోగించి అక్కడ్నుంచీ కొత్త పాట సృష్టిస్తా అని చెప్పాను. రాత్రికి రాత్రి నాకిష్టమైన హిందోళ రాగంలో ఆ పాట చేసి వినిపిస్తే త్రివిక్రమ్ షాకయ్యారు. ‘కంటిన్యూస్‌గా 20 సార్లు ఈ పాట విన్నాను. ఇంత అద్భుతంగా ఉంది’ అని మెచ్చుకున్నారాయన. ఆ కాంప్లిమెంట్‌ని జీవితంలో మర్చిపోలేను. ఆ పాటను రీటా, పాలక్కాడ్ శ్రీరామ్ పాడారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు పాడిన ఆ పాటను పాడటానికి రీటా మొదట  చాలా భయపడింది. ఆరు రోజులు ప్రాక్టీస్ చేసి అద్భుతంగా పాడింది. పాలక్కాడ్ శ్రీరామ్ వయొలినిస్ట్. ఆయన వాయిస్ ఈ పాటకు కరెక్ట్ అని పాడించాను. ఈ పాటను నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పించిన నా గురువు మేండలిన్ శ్రీనివాస్‌కి అంకితమివ్వాలి. ఆయన వేసిన పునాది వల్లనే ఇలాంటి పాట చేయగలిగాను. అసలు ఇలాంటి ట్రెండ్‌లో ఈ తరహా పాట చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే.
 
 ‘బాపుగారి బొమ్మో’ పాట పొయిటిగ్గా ఉంటుంది. అలాంటి పాటలో ‘ఓల్డ్‌మాంక్ రమ్మో’ అని వాడడం అసందర్భంగా అనిపించలేదా?
 ఆ సిట్యుయేషన్‌కి అది కరెక్ట్ అనిపించింది. రేపు సినిమాలో చూస్తే మీరూ ఎంజాయ్ చేస్తారు. రామజోగయ్యశాస్త్రి అద్భుతంగా ఈ పాట రాశారు.
 
 ఓ పాటలో ‘కిర్రాకు’ పదప్రయోగం చేయించారు కదా. దాని సంగతేంటి?
 హైదరాబాద్‌లో చాలా తరచుగా ‘కిర్రాకు’ అని పదం వాడుతుంటారు. ‘కిర్రాకు’ అంటే క్రాక్ అన్న మాట. ఎఫ్‌ఎమ్ రేడియోల్లోనూ ఈ పదం పాపులరే. త్రివిక్రమ్‌గారికి ఓసారి దీని గురించి చెబితే, సరిగ్గా ఈ పాట సమయంలో గుర్తు చేశారు.
 
 ‘టైమ్ టూ పార్టీ’ పాటను మాల్గాడి శుభతో పాడించారెందుకని? 
 ఆవిడ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మీకో విషయం తెలుసా? మా నాన్నగారు డెరైక్ట్ చేసిన ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ ద్వారానే ఆమె సింగర్‌గా పరిచయమయ్యారు. ‘గోల్డ్‌స్పాట్’ ప్రకటనలో ఆమె గొంతు విని కోటిగారికి చెప్పారు మా డాడీ. ఆ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. ఆ పాటను ఆమే పాడారు. ఏఆర్ రెహమాన్ కీబోర్డ్ వాయించారు. నేను ఆవిణ్ణి ‘బాబీ’ అని పిలుస్తుంటాను. వెరీ టాలెంటెడ్. ‘తులసి’, ‘జులాయి’ సినిమాల్లో కూడా ఆమెతో పాడించాను. ఇక ఈ పాటను 2, 
 3 రకాల మాడ్యులేషన్స్‌తో పాడారు.
 
 ఫైనల్‌గా ఒక్క ప్రశ్న. హీరోగా ఎప్పుడు వస్తున్నారు?
 అందరూ అడుగుతున్నారు. మ్యూజిక్‌కే టైం చాలడం లేదు. ఇక ఎక్కడ చేయగలను? అయినా చాలామంది కథలు వినిపిస్తున్నారు. అందరూ పెద్ద పెద్దవాళ్లే. ఆశ్చర్యకరంగా తమిళం నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.
 - పులగం చిన్నారాయణ
 
>