ఇటు కుటుంబం కోసం ఆరాటం...అటు దేవుడిపై పోరాటం

11 May, 2014 22:56 IST|Sakshi
ఇటు కుటుంబం కోసం ఆరాటం...అటు దేవుడిపై పోరాటం

 మేఘజలం కోసం ఎదురుచూసే చాతకపక్షిలా... కొత్తదనం ఉన్న సినిమాల కోసం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎంత ఎదురు చూసినా... వారి దాహార్తిని తీర్చే సినిమాలు మాత్రం రావడం లేదు. అయితే... త్వరలో రెండు సినిమాలు రాబోతున్నాయి. వైవిధ్యం కోసం వెంపర్లాడే ప్రేక్షకుని దాహార్తిని ఆ రెండు సినిమాలూ పూర్తి స్థాయిలో తీర్చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వాటిలో ఒకటి ‘దృశ్యం’. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని... ఆ ఇంటిపెద్ద ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం.
 
 మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. పక్కింటి కథలా సింపుల్‌గా అనిపించినా... కథనం, పాత్రల తీరు తెన్నులు చాలా వైవిధ్యంగా అనిపిస్తాయి. తెలుగు తెరకు ఇది కచ్చితంగా కొత్త ప్రయత్నం. ఇక రెండో సినిమా విషయానికొస్తే... బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్. దేవుడిపైనే కేసు వేసిన ఓ సామాన్యుడి కథ. మనుషుల మనసుల్లో నలుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానంగా ఉంటుందీ సినిమా. బాలీవుడ్‌లో పరేశ్‌రావెల్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో వేసిన సెట్‌లో ‘ఓ మైగాడ్’ తెలుగు వెర్షన్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ రెండు సినిమాలకూ కథానాయకుడు వెంకటేశే కావడం నిజంగా విశేషమే. నటునిగా ఆయనఆకలిని, కొత్తదనం కోసం తపించే ప్రేక్షకుల దాహార్తిని ఒకేసారి తీర్చేసే పనిలో నిమగ్నమైపోయారు వెంకటేశ్.
 
 ‘దృశ్యం’లో ఆయనది సగటు మనిషి పాత్ర అయితే...  ‘ఓ మైగాడ్’లో ఆయనది ప్రజల మనిషి పాత్ర. ప్రశ్నించే పాత్ర. 28 ఏళ్ల కెరీర్‌లో వెంకటేశ్ ఎన్ని వైరైటీ పాత్రలు చేసినా... ఈ రెండు పాత్రలు మాత్రం ఆయన కెరీర్‌లో ప్రత్యేకం. ఇక ‘దృశ్యం’లో కథానాయికగా మీనా నటిస్తుండగా, నదియా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో సురేశ్‌ప్రొడక్షన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ‘ఓ మైగాడ్’ రీమేక్ విషయానికొస్తే... సురేశ్‌ప్రొడక్షన్స్, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్ ఇందులో శ్రీకృష్ణునిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. ఇందులో కథానాయికగా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం ఇష్టం’ ఫేం కిషోర్‌కుమార్(డాలీ) ఈ చిత్రానికి దర్శకుడు.