ఆ మాటలే నాకు కనువిప్పు : పవన్ కల్యాణ్

4 Jan, 2015 23:33 IST|Sakshi
ఆ మాటలే నాకు కనువిప్పు : పవన్ కల్యాణ్

‘‘మేమిద్దరం కలిసి ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. అది కూడా ఒక మంచి చిత్రం చేయడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని వెంకటేశ్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కిశోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో  వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో డి. సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘గోపాల గోపాల’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ  - ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇందులో నటించడానికి పవన్ అంగీకరించగానే చాలా సంతోషం అనిపించింది’’ అని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఒకప్పుడు నాకేం అవ్వాలో తెలిసేది కాదు. అమ్మ, అన్నయ్యలు అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు.
 
  అన్నయ్య కష్టపడి సినిమాలు చేస్తుంటే నేను యోగా, ధ్యానం చేస్తూ, వాటి గురించే అన్నయ్యకు చెప్పేవాణ్ణి. ‘కష్టపడే అన్నయ్య.., వేళకి అన్నంపెట్టే వదిన ఉంటే ఎవరైనా ఇలానే మాట్లాడతారు’ అని అన్నయ్య అన్నారు. ఆ మాటలే నాకు కనువిప్పు అయ్యాయి. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి.. అలాగని బాధ్యతలను విస్మరించకూడదని తెలుసుకున్నాను. ఆరోజు అన్నయ్యగారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని, తుది శ్వాస వరకు కష్టపడతాను. ‘ఖుషీ’ టైమ్‌లో ‘అన్నా ఒక్క హిట్ ఇవ్వు అన్నా.. రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. చచ్చిపోతున్నాం’ అని అభిమానులు అడిగేవాళ్లు. ఆ ప్రేమకు కదిలిపోయేవాణ్ణి. నేను నాకోసం ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. కానీ, మొట్టమొదటిసారి ‘ఒక్క హిట్ ఇవ్వు. సినిమాల నుంచి వెళ్లిపోతా’ అని కోరాను. హిట్ ఇచ్చాడు.
 
  సినిమాల నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ‘ఖుషి’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఎందుకో... రానున్న రోజులన్నీ నాకు కష్టాలే అనే భావన కలిగింది. ఆ వెంటనే.. ఇంకోటి కూడా అనిపించింది. ఏం చేయాలో తెలియక, నా స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం పారిపోవాలనుకున్న నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసి, ఇంతమంది అభిమానం పొందేలా చేసిన ఆ భగవంతుడు చూసుకుంటాడనుకున్నాను. జయాపజయాలు రెండూ ఆ భగవంతుడి చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నది శ్రమ, కృషి. ఆ రెంటినీ బాగా చేస్తాను.
 
  సినిమాల్లోకి రాకముందే నాకు వెంకటేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన్ను సోదరుడిలా భావిస్తాను. నేను మామూలుగా ఎవరి ఇంటికీ వెళ్లను. కానీ, వెంకటేశ్‌గారి ఇంటికే వెళతాను. సినిమాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను కలిసే వ్యక్తి వెంకటేశ్‌గారు . మేం ఇద్దరం కలిస్తే, సినిమాల గురించి తక్కువ మాట్లాడతాం. ఆధ్యాత్మికత గురించి ఎక్కువ  మాట్లాడుకుంటాం. బహుశా అదే మా ఇద్దరితో ఈ సినిమా చేయించిందేమో’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం కూడా పాల్గొన్నారు.