అవును... వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు!

21 Oct, 2014 00:46 IST|Sakshi
అవును... వాళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు!

 ఆ రోజు శ్రీకృష్ట జన్మాష్టమి. అందరూ ఆ పరమాత్మ లీలల్ని స్మరిస్తూ తన్మయత్వంతో ఆడిపాడుతున్నారు. అక్కడ రంగులు జల్లుకుంటూ ఆనందపరవశులయ్యేవారు కొందరైతే... ‘ఉట్టి’ సంబరంలో తలమునకలయ్యేవారు ఇంకొందరు. ఇలాంటి సందర్భంలో ఏకంగా ఆ దేవదేవుడే... ఆ భక్తజనంలో ఒకడిగా మారిపోయి సంబరంలో పాలుపంచుకుంటే... ఆ ఫీల్ ఎలా ఉంటుంది? తెలియని వారి సంగతి ఎలా ఉన్నా... తెర ముందు కూర్చొని చూస్తూ... అన్నీ తెలిసిన ప్రేక్షకుడికి మాత్రం అది నిజంగా తన్మయానందమే. త్వరలో ప్రేక్షకుడు అలాంటి అనుభూతినే పొందబోతు న్నాడు. ‘గోపాల... గోపాల’ సినిమా కోసం కృష్ణాష్టమి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం ధ్రువీకరించారు.
 
  ఈ పాటలో ‘గోపాలుడు’ పవన్‌కల్యాణ్‌తో పాటు, ‘గోపాల్రావ్’ పాత్రధారి వెంకటేశ్ కూడా పాల్గొంటారు. ప్రేక్షకులు సంభ్రమానికి లోనయ్యేలా ఈ పాటను చిత్రీకరించనున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ చిత్రం ఈ చిత్రానికి మాతృక అన్న విషయం తెలిసిందే. తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసి, జనరంజకంగా దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాతృకలో లేని ఈ పాటను తెలుగులో చేర్చడం విశేషం.
 
 ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా శ్రీయ నటిస్తున్నారు. ఇక కథలో కీలకమైన పాత్రను అలనాటి బాలీవుడ్ సూపర్‌స్టార్ మిథున్ చక్రవర్తి పోషిస్తున్నారు. ఇంకా పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్ మరార్.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా