తగ్గమంటే తగ్గాల్సిందే!

29 Jun, 2018 01:19 IST|Sakshi

లావుగా ఉంటే బాగుంటుందా? సన్నగా కనిపించాలా? ఈ కన్‌ఫ్యూజన్‌ చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. ఎందుకంటే లావుగా ఉంటే సన్నబడమంటారు. సన్నగా ఉంటే మరీ ఇంత బక్కపలచగానా? అంటారు. మలయాళ బ్యూటీ మంజిమా మోహన్‌ ఇలాంటి విషయంలోనే కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. ఇప్పుడున్న కథానాయికల్లా స్లిమ్‌గా కాకుండా మంజిమా కొంచెం బొద్దుగానే ఉంటారు. ‘నేను అనుకున్న క్యారెక్టర్‌కి నువ్విలా ఉంటేనే బాగుటుంది’ అని ఓ డైరెక్టర్‌ అంటే, వేరే డైరెక్టర్లు ‘ఫిట్‌గా ఉండాలి. కొంచెం బరువు తగ్గాలి’ అన్నారట.

ఈ విషయం గురించి మంజిమా మోహన్‌ మాట్లాడుతూ – ‘‘నా దృష్టిలో ఫిజిక్‌ అనేది క్యారెక్టర్‌ని బట్టి ఉండాలి. అలాగే, డైరెక్టర్స్‌ ఎలా కోరుకుంటున్నారో అలా ఉండాలి. ఇప్పటివరకూ నేను నాలా ఉంటే చాలనే దర్శకులతో సినిమాలు చేసినందుకు ఆనందంగా ఉంది. అయితే కొందరు మాత్రం ‘నువ్వు తగ్గితే ఇంకా బాగుంటావ్‌. కెరీర్‌ ఇంకా డెవలప్‌ అయ్యే అవకాశం ఉంది’ అన్నారు. నేను మాత్రం నేనిప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా ఓకే అనుకుంటున్నాను.

అయితే తగ్గాలని సలహా ఇచ్చినప్పుడు ‘కుదరదు’ అని మొండిగా వాదించడం కరెక్ట్‌ కాదు. అందరూ నా బరువు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తగ్గాల్సిందే. అందులో తప్పేం లేదు. అందుకే చాలెంజ్‌గా తీసుకుని, తగ్గడం మొదలుపెట్టాను. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు బాగానే ఉంది’’ అన్నారు. అన్నట్లు.. మంజిమా మోహన్‌ ఎవరో గుర్తుండే ఉంటుంది. నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించారు. ఇప్పుడు హిందీ ‘క్వీన్‌’ మలయాళ రీమేక్‌ ‘జామ్‌ జామ్‌’లో కథానాయికగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా