ఆ రెండూ నా బ్యాగులో ఉండాల్సిందే!

28 Dec, 2015 01:32 IST|Sakshi
ఆ రెండూ నా బ్యాగులో ఉండాల్సిందే!

 అమ్మాయిలు రోడ్డు మీదకొస్తే చాలు.. ఆకతాయిలు అల్లరిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. రోజులు మారుతున్నా ఈ విషయంలో మాత్రం మార్పు లేదు. అందుకే ఆడవాళ్లకు ఆత్మరక్షణ తెలిసి ఉండాలని నమిత అంటున్నారు. మలేసియాలో జరిగిన ‘తర్‌కాప్పు’ అనే తమిళ చిత్రం ఆడియో వేడుకలో ఆమె అతిథిగా పాల్గొన్నారు. తర్‌కాప్పు అంటే ఆత్మరక్షణ అని అర్థం. సందర్భోచితంగా ఈ వేదికపై ఆత్మరక్షణ గురించి నమిత మాట్లాడుతూ - ‘‘నా స్కూల్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు నా వెంటపడేవాళ్లు.
 
 బస్సులో వెళ్లేటప్పుడు తాకడానికి ట్రై చేసేవాళ్లు. అలాంటివాళ్లకు బుద్ధి చెప్పాలంటే బ్యాగులో సేఫ్టీ పిన్ను పెట్టుకోవాల్సిందే అనుకున్నాను. ఆ మర్నాడు గుర్తుగా బ్యాగులో పెట్టుకుని వెళ్లాను. నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించాలని చూసినవాణ్ణి పిన్నీసుతో గుచ్చాను. అతను పైకి చెప్పలేక బాధను దింగమింగుకోవడం చూసి, చాలా ఆనందపడిపోయాను. పెప్పర్ స్ప్రే గురించి ఇప్పుడిప్పుడే జనాల్లో అవగాహన వస్తోంది.
 
 కానీ, టీనేజ్ దాటినప్పుడే నాకు దాని గురించి తెలుసు. పిన్నీసులతో పాటు పెప్పర్ స్ప్రే కూడా బ్యాగులో ఉంచుకోవడం మొదలుపెట్టాను. ఆడవాళ్లు బయటికెళ్లేటప్పుడు పిన్నీసులు, పెప్పర్ స్ప్రే కచ్చితంగా బ్యాగులో ఉండేలా చూసుకోవాలి. ఎవరో వచ్చి కాపాడతారు? అని ఎదురు చూసే బదులు మనల్ని మనం రక్షించుకోవాలి. పిరికివాళ్లను వేధిస్తారు. ధైర్యవంతుల జోలికి రావడానికి సాహసించరు. అందుకే ఆడవాళ్లు ధైర్యంగా ఉండాలి’’ అని చెప్పారు.