ఆ ఇద్దరిపై వేటుపడనుందా?

25 Jan, 2017 01:21 IST|Sakshi
ఆ ఇద్దరిపై వేటుపడనుందా?

పెటా ఇప్పుడు చాలా మందికి శిరోభారంగా మారింది. ఇంతకు ముందు ఆ సంస్థతో సంబంధాలు పెట్టుకుని ప్రచారకర్తలుగా వ్యవహిరించిన వాళ్లిప్పుడు అయ్యయ్యో మాకెలాంటి సంబంధాలు లేవంటూ తప్పించుకుంటున్నారు. కారణం పెటా అన్నది తమిళనాడుకిప్పుడు ఒక తీవ్రవాద సంస్థగా మారింది. దాన్ని తరిమికొట్టేదాకా నిద్రపోం అంటున్నారు తమిళులు.

పెటా గురించి చెప్పాలంటే మూగజీవాల సంరక్షణ సంస్థగా సినీ ప్రముఖులను ఆకర్షించి వారికి ప్రసార బాధ్యతలు అప్పగించి తద్వారా మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలోనూ బలంగా నాటుకుపోయిన సంస్థ. తొలుత నటి ఐశ్వరాయరాయ్‌ను అంబాసిడర్‌గా నియమించుకుని దేశంలోని గ్రామ గ్రామాలకు వ్యాపించింది. తమిళ, తెలుగు నటీనటులను వాడుకుని వారికి అవార్డులు అందిస్తే తన ప్రచారాన్ని విస్తరించుకుంది. పలువురు తారలు పెటా అనే ఆంగ్ల అక్షరాలతో కూడిన టీషర్టులను ధరించి ప్రచారం చేసి ఆ సంస్థ వ్యాప్తికి సహకరించారు.

కోలీవుడ్‌లో త్రిష
ఇటీవల తమిళుల ఆగ్రహానికి గురైన నటి త్రిష అలానే పెటా చట్రంలోకి వచ్చారు. ఇప్పుడేమో తనకు పెటాకు ఎలాంటి సం బందం  లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇక నటుడు ధనుష్‌ కూడా పెటా సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. ఆయనా ఇప్పుడు ఆ అవార్డును స్వీకరించడం అవమానంగా భావిస్తున్నానని స్టేట్‌మెంట్‌ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు.

జల్లికట్టు నిషేధానికి పెటా కారణం అవుతుందని, విద్యార్థులు పెటాను ఒక తీవ్రవాద సంస్థగా దానికి వ్యతిరేకంగా ఇంతగా పోరాడతారని అప్పట్లో ఈ తారలు ఆలోచించి ఉండరు.పెటాకు సపోర్టు చేసిన నటీనటుల్ని విద్యార్థులు సోషల్‌ మీడియాలో విమర్శలతో దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా త్రిష గురించి ముద్రించిన పోస్టర్లు చిత్ర పరిశ్రమలో పెనుసంచలనాన్నే కలిగించాయి. దీంతో చిత్ర పరిశ్రమ అంతా పెటాకు వ్యతిరేకంగా గళం ఎత్తుడం మొదలెట్టింది. ఇటీవల నడిగర్‌ సంఘం నిర్వహించిన మౌనపోరాటంలో త్రిష సహా పలువురు సినీ తారలు పాల్గొని జల్లికట్టుకు మద్దతు పలికారు.

బహిష్కరణ డిమాండ్‌
కాగా ఆ సయమంలోనే పెటాకు సపోర్టు చేసిన నటీనటుల్ని  నడిగర్‌సంఘం నుంచి బహిష్కరించాలనే ఓత్తిడి సభ్యుల నుంచి పెరిగింది. పెటా నుంచి వైదొలగని తారలను సంఘం నుంచి బహిష్కరించాలని దర్శకుడు చేరన్ రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. దీంతో కొందరు పెటా నుంచి వైదొలగినట్లు సంఘ నిర్వాహకుడొకరు తెలిపారు. అయితే నటి కాజల్‌అగర్వాల్, తమన్నా, ఎమీజాక్సన్  ఇప్పటికీ పెటాలో కొనసాగుతుండడంతో పాటు నడిగర్‌సంఘం నిర్వహించిన మౌనపోరాటంలో పాల్గొనలేదు. ఇంగ్లిష్‌ బ్యూటీ సంఘంలో సభ్యురాలు కాదు. ఇక తమన్నా, కాజల్‌అగర్వాల్‌లపై బహిష్కరణ వేట వేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.ఈ వ్యవహారంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు నడిగర్‌సంఘం నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.