పేట నటికి లక్కీచాన్స్‌

27 Sep, 2019 11:29 IST|Sakshi

పేట చిత్రం ఫేమ్‌ మాళవికమోహన్‌ లక్కీచాన్స్‌ కొట్టేసిందన్నది తాజా సమాచారం. పేట చిత్రంలో నటుడు శశికుమార్‌కు జంటగా నటించిన మలయాళ కుట్టి ఈ అమ్మడు. అయితే తొలుత మాతృభాషలో 2013లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ పరిచయమైంది. తాజాగా ఈ బ్యూటీకి ఒక్కసారిగా దళపతి విజయ్‌తో రొమాన్స్‌ చేసే చాన్స్‌ వరించినట్లు తాజా సమాచారం.

విజయ్‌ ప్రస్తుతం నటిస్తున్న బిగిల్‌ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న బిగిల్‌ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నటుడు విజయ్‌ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశీయానంలో ఉన్నారు. తిరిగి రాగానే కొత్త చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇది ఆయన నటించే 64వ చిత్రం అవుతుంది. మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎక్స్‌బీ.ఫిలింస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవీర్‌ బ్రిటో నిర్మించనున్నారు. కాగా ఇందులో విజయ్‌ సరసన నటించే నటి ఎవరన్న విషయం గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో మొదట నటి రష్మికమందన నటించబోతోందనే ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. తాజాగా మలయాళీ గ్లామరస్‌ నటి మాళవికమోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్‌ చిత్రాల్లో ఒకరికి మించి హీరోయిన్లు ఉండడం పరిపాటిగా మారింది. కాబట్టి ఇందులోనూ మరో హీరోయిన్‌ మాళవికమోహన్‌ నటించనుందని సమాచారం.

ఇకపోతే కియారాఅద్వాని ప్రధాన హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సత్యన్‌ సూర్యన్‌ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా