పండక్కి పేట లేనట్టే

21 Dec, 2018 06:07 IST|Sakshi
రజనీకాంత్‌

రజనీకాంత్‌ సినిమా అంటే హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్, చెన్నైలోని టీ నగర్‌లో ఏకకాలంలో రిలీజ్‌ కావాల్సిందే. అది రజనీ క్రేజ్‌. అదేనండీ.. అక్కడా ఇక్కడా అన్ని ఏరియాల్లోనూ ఆయన బొమ్మ పడాల్సిందే. తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్‌కి అంత క్రేజ్‌ ఉంది. ‘బాబా’ (2002) నుంచి దాదాపు రజనీకాంత్‌ ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌ కావడం ఆనవాయితీ అయ్యింది. కానీ ఈసారి పండక్కి (సంక్రాంతికి) ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) లేనట్టే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘పేట్టా’.

సన్‌ పిక్చర్స్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్‌ కథానాయికలు. ఈ సినిమాను తమిళంలో పొంగల్‌కి రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. కానీ తెలుగులో సంక్రాంతికి ఈ చిత్రం విడుదలపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ సంక్రాంతి సీజన్‌కు బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’, వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌2’(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి. థియేటర్స్‌ ఇబ్బంది అవుతుందనో లేక మరేదైనా కారణమో కానీ ‘పేట’ను జనవరి 25 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. ఈ చిత్రం తెలుగు ఆడియో గురువారం రిలీజ్‌ అయింది. కాగా ఈ చిత్రం తెలుగు విడుదల హక్కులు సి. కల్యాణ్‌ పొందారని వార్త వచ్చింది. అది నిజం కాదని కల్యాణ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు