ఈ సినిమాలో మంచి దెయ్యం ఉంది!

4 Feb, 2015 23:31 IST|Sakshi
ఈ సినిమాలో మంచి దెయ్యం ఉంది!

- పూరి జగన్నాథ్
‘‘మామూలుగా నేను దెయ్యం సినిమాలు చూడను. కానీ, ఈ చిత్రంలో మంచి దెయ్యం ఉందంటున్నారు. అందుకని చూడాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. మిస్కిన్ దర్శకత్వంలో దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘పిశాచి’ అదే పేరుతో తెలుగు తెరకు రానుంది. బాల సమర్పణలో ఈ చిత్రాన్ని సి. కల్యాణ్, కల్పన విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో నిర్మాతలు  కేయస్ రామారావు, అశోక్‌కుమార్, సీవీ రావు, ఎగ్జిబిటర్ అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఓ అందమైన దెయ్యం కథ ఇది. నిర్మాత శింగనమల రమేశ్ కుమారుడు హీరోగా నటించాడు. తమిళ ‘పిశాచి’ విడుదలైన రోజునే ఆమిర్‌ఖాన్ హిందీ చిత్రం ‘పీకే’ విడుదలైంది.

హిందీ చిత్రం మీద అంచనాలతో మల్టీప్లెక్స్‌లో రోజుకి ఒక్క షో మాత్రమే ‘పిశాచి’కి ఇచ్చారు. మొదటి రోజే సినిమా బాగుందనే టాక్ రావడంతో వారం తిరిగేసరికి ఏడెనిమిది షోస్‌కి పెరిగింది. అది ఈ సినిమా స్థాయి. ఈ నెల 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పిశాచి’ వస్తుంది’’ అన్నారు.