పోలీసులు నన్ను అతిథిగా పిలిచి,లాఠీ బహుమతిగా ఇచ్చారు!

13 Jul, 2014 00:45 IST|Sakshi
పోలీసులు నన్ను అతిథిగా పిలిచి,లాఠీ బహుమతిగా ఇచ్చారు!

వ్యవస్థలో మార్పు తెచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే ‘అంకుశం’. సమాజంలో పోలీస్‌పై గౌరవాన్ని పెంచిన సినిమా ఇది. అలాగే... పోలీసుల్లో నిజాయితీని నింపిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు ముందు పోలీస్ కథలెన్ని వచ్చినా... ‘అంకుశం’ ప్రత్యేకం. ఈ సినిమా విడుదలై నేటికి పాతికేళ్లు. ఈ సందర్భంగా ‘అంకుశం’ దర్శకుడు కోడి రామకృష్ణ జ్ఞాపకాలు...

‘అంకుశం’కి పాతికేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నా. ఎందుకంటే, అది కేవలం డబ్బు కోసం చేసిన సినిమా కాదు. ఆదర్శంతో తీసిన సినిమా. అందుకే నాకు ప్రత్యేక అభిమానం. ‘అంకుశం’కి ముందు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి సంస్థలో ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’ చేశా. రెండూ సూపర్‌హిట్లే. మా కాంబినేషన్‌లో మూడో సినిమా కాబట్టి, అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కథ చేయాలని ఒకటే ఆలోచన.

 చిన్నప్పటి నుంచీ పోలీసులంటే అభిమానం. అసలు ఆ వృత్తి అంటేనే నాకు గౌరవం. వారిపై నాటకాలు కూడా రాశా. అందుకే.. ఒక పోలీస్ కథను ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నా మస్తిష్కంలో మెదిలింది. ఆ ఆలోచనే రెడ్డి గారితో చెప్పాను. ఆయన ‘చూస్తారంటారా?’ అన్నారు. కచ్చితంగా చూస్తారని నమ్మకంగా చెప్పా. పోలీసు కథంటే సెన్సార్ సమస్యలొస్తాయేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ‘సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చాను. అలా ‘అంకుశం’ కథ మొదలైంది.
 ఒక రాజకీయ నేత రోడ్ మీద ఆగితే... కూల్‌డ్రింక్ అందించేవారు కోకొల్లలు. కానీ, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ, నిరంతరం ఎండలో నిలబడి వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఒక పోలీస్‌కు మంచినీళ్ళివ్వడానికి ఒక్కడూ ముందుకు రాడు. మొదటి నుంచీ పోలీసంటే సమాజంలో చిన్న చూపు. దీన్ని ప్రశ్నిస్తూ, పోలీసు వ్యవస్థ గౌరవం పెంచాలనిపించింది. ఆ కసితోనే ముందు విజయ్ పాత్ర సృష్టించా.

 ఆ పాత్ర రాసుకున్న దగ్గర నుంచీ నా మనసులో మెదిలిన రూపం రాజశేఖరే. నిజానికి నా రెండో సినిమా ‘తరంగణి’కే అతణ్ణి తీసుకుందామనుకున్నా. అయితే అప్పుడాయన భారతీరాజా సినిమా చేస్తున్నాడు. తెలుగు సినిమా చేయడానికి భారతీరాజా ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రకు భానుచందర్‌ను తీసుకున్నా. రాజశేఖర్ గొప్ప నటుడు. సరైన పాత్ర దొరికితే... దానికోసం ఎంత స్ట్రగులైనా అనుభవిస్తాడు. ఈ సినిమా గురించి చెప్పగానే... రాజశేఖర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘ప్రాణం పెట్టి చేస్తా సార్’ అన్నాడు. అన్నట్లుగానే సిన్సియర్‌గా చేశాడు.

 కథానాయకుని పాత్ర ఎలివేట్ అవ్వాలంటే, ప్రతినాయకుడు శక్తిమంతంగా ఉండాలి. అందుకే విలన్ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టా. రౌడీలను అతి సమీపంలో నుంచి చూసిన అనుభవం నాది. ఆ అనుభవాలను రంగరించే నీలకంఠం పాత్రను సృష్టించాను. ఆ పాత్రను ఎవరితో చేయించాలి? అన్వేషణ మొదలైంది. చాలామందిని చూశాను. కానీ... కంటికి ఆనడం లేదు. ఓ రోజు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారి బంధువుల ఇంటికెళ్లాం. అక్కడ కనిపించాడు ఓ వ్యక్తి.

 రెడ్డిగారి బంధువు. అటూ ఇటూ తిరుగుతుంటే అతణ్ణే గమనిస్తూ కూర్చున్నా. వివరాలు తెలుసుకున్నా. పేరు రామిరెడ్డి. చదువుకుంటున్నాడు అని తెలిసింది. ఓ రోజు తనకు చెప్పకుండానే మేకప్ టెస్ట్ చేశాం. ‘ఏంటి ఇదంతా’ అని కంగారు పడ్డాడు. ఒప్పుకునేలా కనిపించలేదు. ఎమ్మెస్‌రెడ్డిగారితో చెప్పించాం. ‘చేయ్. విలన్ పాత్ర బాగుంది. మంచి పేరొస్తుంది. సిగ్గెందుకు. నేను చేయడంలా?’ అని ఆయన గట్టిగా చెప్పడంతో ఒప్పుకున్నాడు.

 చార్మినార్ ముందు తన్నుకుంటూ తీసుకెళ్లే సీన్ రామిరెడ్డిపై మేం తీసిన తొలి షాట్. పాపం రాజశేఖర్ నిజంగానే లాఠీ విరిగేలా కొట్టాడు. కానీ... పాత్ర కోసం అతను తన్నులు తిన్నాడు. అదీ గొప్పతనం. ఆ సన్నివేశం నిజం అద్భుతంగా పండింది. కానీ... ఆ సీన్ తర్వాత రామిరెడ్డి మళ్లీ కనిపించలేదు. ఏంటని ఆరా తీస్తే, ‘నేను చేయను. నన్ను గుడ్డలూడదీసి మరీ తంతారంట కదా... అని నా గాళ్‌ఫ్రెండ్సందరూ వెక్కిరిస్తున్నా’రన్నాడు. ‘ఇప్పుడు వెక్కిరించినవారే... రేపు జేజేలు కొడతారు. నీకెందుకు నువ్ చేయ్’ అని నచ్చజెప్పాం. ఆ సినిమా విడుదలైన తర్వాత రాత్రికి రాత్రి ఎమ్మెస్‌రెడ్డిగారు, రామిరెడ్డి స్టార్స్ అయిపోయారు.

 సంగీత దర్శకుడు సత్యం గారి చివరి సినిమా ‘అంకుశం’. ఓ పాట మిగిలుండగానే కన్నుమూశారాయన. నేపథ్యగీతం. ఎవరితో చేయించాలా అనుకుంటుండగా, రచయిత రాజశ్రీ ముందుకొచ్చారు.  ‘అంకుశం’ విడుదలయ్యాక ఓ రోజు నేను, ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్‌రెడ్డిగారు ట్యాంక్‌బండ్ దగ్గర నిలబడ్డాం. అది నో పార్కింగ్ ప్లేస్. దాంతో ఇద్దరు పోలీసులు మా దగ్గరకొచ్చి, ‘ఫైన్ కట్టండి’ అన్నారు. దాంతో వారితో వాదన మొదలైంది. ఉన్నట్లుండి నాలుగు జీపులు వచ్చి అక్కడ ఆగాయి.

 అందులో నుంచి పోలీస్ ఉన్నతాధికారులు దిగారు. మమ్మల్ని చూసి పరుగుపరుగున మా వద్దకొచ్చారు. ‘ఆయన ఎవరనుకున్నారు? కోడి రామకృష్ణగారు. సెల్యూట్ కొట్టండి’ అని గద్దించారు. ‘మా పోలీసుల గౌరవాన్ని పెంచిన మనుషులు మీరు. మా వాళ్లు ఇలా ప్రవర్తించినందుకు సారీ సార్’ అన్నారు. తర్వాత ఓ ప్రభుత్వ వేడుకకు నన్ను అతిథిగా పిలిచి, పోలీస్ లాఠీ బహుమతిగా ఇచ్చారు. ఆ క్షణంలో ఎంత సంతృప్తి ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఆ లాఠీ నా దగ్గరే భద్రంగా ఉంది.

‘అంకుశం’ 20 పైచిలుకు కేంద్రాల్లో వందరోజులాడింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో ఏడాది ఆడింది. ఆ రోజుల్లో బాగా వసూలు చేసిందా సినిమా. తమిళ, మలయాళాల్లోకి అనువదిస్తే, అక్కడ కూడా విజయం సాధించిందీ సినిమా. ఆ పాత్ర మీదున్న ప్రేమతో చిరంజీవి గారు హిందీలో ‘ప్రతిబంధ్’గా చేసి, విజయం సాధించారు. నా కెరీర్‌లో ‘అంకుశం’ ఓ విలువైన రత్నం. ఇలాంటి మంచి సినిమాను నాతో చేయించిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్.

మల్లెమాల గారి స్టయిలంటే నాకిష్టం. ఆయన మాట్లాడే తీరు సునిశితంగా, గమ్మత్తుగా ఉంటుంది. ఆయన లాంటి వ్యక్తి ఓ బడిపంతులైతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన నుంచే ‘అంకుశం’లో సీఎం పాత్ర పుట్టింది. ఈ మాటే చెప్పి, ‘మీరే ఈ పాత్ర చేయా’లన్నాను. ముందు తటపటాయించినా.. తర్వాత సరే అన్నారు.