దర్శకుడు రాజమౌళికి కోర్టు నోటీసులు

12 Feb, 2016 04:36 IST|Sakshi
దర్శకుడు రాజమౌళికి కోర్టు నోటీసులు

ఈ నెల 24లోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని లోటస్‌హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో (జి-1) ఫ్లాట్ రాజమౌళి పేరిట ఉంది. 2011 అక్టోబర్ 1న ఈ ఫ్లాట్‌ను రాజమౌళి అమ్మకానికి పెట్టగా సినీ నిర్మాత భువనేశ్వర్ మారం రూ. 41 లక్షలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ. 2.7 లక్షలు ఇచ్చారు. అయితే సదరు అపార్ట్‌మెంట్‌ను అక్రమంగా నిర్మించడమే కాకుండా క్రమబద్ధీకరించకపోవడం, నాలుగేళ్లపాటు ఆస్తిపన్ను కట్టకపోవడం, ఎల్‌ఐసీలో రుణం ఉండటం వంటి కారణాలతో ధ్రువపత్రాలు భువనేశ్వర్‌కు ఇవ్వడంలో జాప్యం జరిగింది.

రాజమౌళి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ ఫ్లాట్‌ను మరొకరికి విక్రయించారు. దీంతో రాజమౌళి తనను మోసం చేశారంటూ అదే ఏడాది భువనేశ్వర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాజమౌళిపై చీటింగ్ కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. అనంతరం మూడుసార్లు నోటీసులు జారీ చేసినా రాజమౌళి స్పందించకపోవడంతో ఈ నెల 24 లోపు కోర్టుకు హాజరుకావాలంటూ గురువారం నోటీసులు అందజేశారు.