సినిమా చూపిస్త మావా..

22 Mar, 2019 10:53 IST|Sakshi

అభ్యర్థులు, పార్టీ విధానాలపై చిత్రాలు ఆకట్టుకునేందుకు అస్త్రాలు

ఇంతవరకు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గురించి, తమ పార్టీ గురించి భారీగా ప్రచారం చేసుకోవడం చూశాం. ఈసారి ఎన్నికల్లో  సినిమాలూ ప్రచారంలోకి దిగిపోయాయి. 2019 ప్రారంభం నుంచే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం, అవి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలు కావడంతో పాటు ప్రజల దృష్టిని ఎన్నికల వైపు మళ్లించాయి. ‘ఉరీ: ద సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ వంటి సినిమాలు అలాంటివే. వీటిలో ఒక సినిమా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి చిత్రరూపమిస్తే, గత ప్రభుత్వం ఎంత నిష్క్రియాపరత్వంతో ఉందో చూపించింది రెండో సినిమా. ఈ రెండు సినిమాలూ అధికార పార్టీ రాజకీయ ఎజెండాకు అద్దం పట్టాయన్న చర్చ ట్విట్టర్‌లో సాగింది.

‘స్టార్‌’ క్యాంపెయిన్‌..
జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలూ సినిమాల ద్వారా ప్రచారం సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రాంతీయ రాజకీయాల్లో ఈ సినిమాల దూకుడు మరింత ఎక్కువుంది. శివసేన అధిపతి బాల్‌ఠాక్రేపై ‘ఠాక్రే’ పేరుతో సినిమా వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి (యాత్ర)పై సినిమాలు వచ్చాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కూడా ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రాజకీయ కథాంశాలతో సినిమాలను తీయడమే కాక టాప్‌ హీరోలతో వాటికి ప్రచారం చేయిస్తున్నారు. తద్వారా ఆ నటీనటులతో రాజకీయ పార్టీలు తమ ఎజెండాలను ప్రచారం చేయించుకుంటున్నాయి. అంటే ఈ సినిమాలకు ప్రచారం చేసే అగ్రనటులంతా పరోక్షంగా రాజకీయ పార్టీల బ్రాండ్‌ అంబాసిడర్లన్న మాట. గతంలోనూ రాజకీయాలపై, రాజకీయ నాయకులపై సినిమాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్‌ మరీ పెరిగింది.

త్వరలో విడుదల..
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో ‘పీఎం నరేంద్రమోదీ’ పేరుతో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంట్లో వివేక్‌ ఒబరాయ్‌ది మోదీ పాత్ర.
మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణంపై ‘తాష్కెంట్‌ ఫైల్స్‌’ పేరుతో థ్రిల్లర్‌ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఇంకా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారాగ్రహి’, ‘మేరే ప్యారే పీఎం’, ‘రైఫిల్‌ మ్యాన్‌’, ‘బెటాలియన్‌ 609’ వంటి సినిమాలు ఎన్నికలకు ముందు విడుదల కానున్నాయి.

మరిన్ని వార్తలు