కంగనా వర్సెస్‌ పూజా

11 Jul, 2020 01:39 IST|Sakshi
పూజా భట్‌, కంగనా రనౌత్‌

‘‘మీ నాన్న (నటి, దర్శక–నిర్మాత పూజా భట్‌ తండ్రి మహేశ్‌ భట్‌ని ఉద్దేశించి) అవకాశం ఇవ్వడం వల్ల నాకు చాలా పెద్ద నష్టమే జరిగింది. సరిగ్గా అప్పుడే నాకు తెలుగులో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో చక్కని అవకాశం ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. మీ ‘గ్యాంగ్‌స్టర్‌’ సినిమా వల్ల ‘పోకిరి’లాంటి మంచి సినిమా వదులుకున్నాను’’ అని పూజా భట్‌పై మండిపడ్డారు కథానాయిక కంగనా రనౌత్‌.

బాలీవుడ్‌లో బంధుప్రీతి మెండుగా ఉందని, వారసులకు ఇచ్చినంత విలువ బయటినుంచి వచ్చినవాళ్లకు ఇవ్వరని ఎప్పటినుంచో ఓ వివాదం సాగుతోంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఈ వివాదం ఊపందుకుంది. నెపోటిజం టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ నేనున్నానంటూ ముందువరసలో నిలబడి పోరాటం చేస్తున్నారు కంగనా. ఈ నేపథ్యంలో తనకు మొదటి సినిమా (‘గ్యాంగ్‌స్టర్‌’)లో నటించటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత మహేశ్‌ భట్, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు కంగనా.

‘‘మొదటి అవకాశం ఇచ్చిన మా నాన్నపై చీటికీ మాటికీ చురకలు అంటిస్తుంటుంది తను’’ అని ఓ సందర్భంలో పూజా భట్‌ అన్నారట. అలాగే ఆ సినిమా అప్పుడు 2006లో జరిగిన ఓ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారామె. కంగనా ‘ఉత్తమ నూతన కథానాయిక’గా ‘గ్యాంగ్‌స్టర్‌’ చిత్రానికి అవార్డు అందుకున్న వీడియో అది. స్టేజ్‌ మీదకు వెళుతూ, ఆ చిత్రనిర్మాతల్లో ఒకరైన ముఖేశ్‌ భట్‌ (మహేశ్‌ భట్‌ తమ్ముడు)ను హగ్‌ చేసుకున్నారు కంగనా. తర్వాత స్టేజ్‌పైకి వెళ్లి ‘గ్యాంగ్‌స్టర్‌’ టీమ్‌ కెమెరామేన్‌కు, తన మేకప్‌ టీమ్‌తో పాటు ఆమె అక్క రంగోలికి థ్యాంక్స్‌ చెప్పారు కంగనా.

అప్పుడు ఆనందం వ్యక్తం చేసి, ఇప్పుడు విమర్శించడం సరికాదనే అర్థం వచ్చేలా ఆ వీడియోను షేర్‌ చేశారు పూజా భట్‌. అందుకు  సమాధానంగా కంగనా ‘‘నన్ను, నా టాలెంట్‌ను గుర్తించి ఆ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది దర్శకుడు అనురాగ్‌ బస్‌. విశేష్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించారంతే. ఆ సినిమా టైమ్‌లో మీ ఫ్యామిలీ (పూజా భట్‌ ఫ్యామిలీ) వాళ్లు నాపై చెప్పులు విసిరి, నీకు పిచ్చి ఉంది.. ఈ సినిమా తర్వాత నీ కథ ముగిసినట్లే అని విమర్శించారు’’ అని పేర్కొన్నారు. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ పాత కథలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. మరి... ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా