‘ఖచ్చితంగా మరణిస్తాననే అనుకున్నాను’

8 Aug, 2018 17:39 IST|Sakshi
పూజా దద్వాల్‌ (ఫైల్‌ ఫోటో)

‘నాకు బట్టల దగ్గర నుంచి సబ్బుల వరకూ.. మందులు, ఆహారం అన్నింటిని సమకూర్చి.. నేను పూర్తి ఆరోగ్యంగా మారాడానికి అతని ఫౌండేషన్‌ ఎంతో సహకరించింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకు కారణం ఆయనే’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పూజా దద్వాల్. ఇది చదివాకా ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును.. కొన్ని నెలల క్రితం ‘అనారోగ్యం పాలైన సల్మాన్‌ హీరోయిన్‌.. ఆదుకునే వారు లేరు’ అంటూ వార్తలు వచ్చింది ఈ నటి గురించే.

టీబీతో బాధపడుతున్న పూజా దద్వాల్‌ తన అనారోగ్యం గురించి ఆర్ధిక పరిస్థితుల గురించి ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ, సల్మాన్‌ ఖాన్‌ను సాయం చేయాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సల్లుభాయ్‌ ఆమెకు సాయం చేస్తానని మాట ఇవ్వడమే కాక.. తన ఫౌండేషన్‌ వారికి ఆమె గురించి చెప్పాడు. సల్మాన్‌ ఆదేశాలు మేరకు ఈ ఫౌండేషన్‌ పూజాకు అవసరమైన సాయం చేసి ఆమె తిరిగి కోలుకునేలా సహకరించారు. ఐదు నెలల తర్వాత ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు పూజా.

ఈ సందర్భంగా పూజా ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ వ్యాధి గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను మరణిస్తాననే అనుకున్నాను. ఎందుకంటే నా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నన్ను దూరం పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పట్టించుకునే వారు లేరు. ఆ సమయంలో నేను చాలా నిరాశకు గురయ్యాను. కానీ నేను దీన్ని ఇంతటితో ముగించాలని అనుకోలేదు.

ఈ వ్యాధితో పోరాటం చేయాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో సల్మాన్‌ని సాయం కోరాను. నా పరిస్థితి గురించి తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డారు. తక్షణమే ఆయన ఫౌండేషన్‌కి చెప్పి నాకు కావాలసినవన్ని సమకూర్చారు. మందులు, ఆహారం, బట్టలు ప్రతీది. ఈ రోజు నేను బతికున్ననంటే అందుకు కారణం సల్మాన్‌. ఆయన చేసిన మేలును ఎన్నటికి మరవలేను’ అంటూ సల్లుభాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

సల్మాన్ హీరోగా 90ల్లో వచ్చిన 'వీర్‌గాటి‌' చిత్రంలో నటించిన పూజా దద్వాల్ టీబీ వ్యాధి బారిన పడి వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేని స్థితిలో ఉన్నానంటూ, సల్మాన్‌ను సాయం చేయాల్సిందిగా మీడియా ద్వారా వేడుకున్న విషయం తెలిసిందే. పూజా పరిస్థితి తెలుసుకున్న సల్మాన్‌ ఆమె కోలుకునేందుకు అవసరమైన సాయం చేశారు.

మరిన్ని వార్తలు