హరితోనే సంతృప్తి

6 Oct, 2014 01:15 IST|Sakshi
హరితోనే సంతృప్తి

 దర్శకుడు హరి దర్శకత్వంలో నటిస్తే పనిలో సంతృప్తి కలుగుతుందని నటుడు విశాల్ వ్యాఖ్యానించారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. పాండియనాడు, నాన్‌శిగప్పు మనిదన్ చిత్రాల కథానాయకుడిగా, నిర్మాతగా వరుసగా విజయం సాధించిన నటుడు విశాల్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు తామరభరణి అనే సక్సెస్‌ఫుల్ చిత్రం వచ్చింది. తాజాగా పూజై చిత్రం రూపొందింది. నటుడు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈమెకిది తమిళంలో మూడో చిత్రం కాగా నిర్మాతగా విశాల్‌కు మూడో చిత్రం కావడం విశేషం. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
 
 చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో దీపావళికి విడుదల చేయనున్నట్లు నటుడు విశాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ పూజై చిత్రం తన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా పేర్కొన్నారు. ఏడేళ్ల తరువాత హరి దర్శకత్వంలో  పూజై చిత్రం చేశానని చెప్పారు. ఎమ్జీఆర్ లాంటి వారు హరి దర్శకుల మధ్య హరి ఎమ్జీఆర్ లాంటివారని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎమ్జీఆర్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారన్నారు. అదే విధంగా దర్శకుడు హరి తన చిత్రాల వల్ల సైకిల్ స్టాండ్‌లో టోకెన్లు ఇచ్చే వారి వరకు అందరు సంతోషంగా ఉండాలని భావిస్తారన్నారు. పూజై చిత్రంలో నటి రాధిక, సితార సూరి తదితర ప్రముఖ నటీనటులు నటించారన్నారు. ముఖ్యంగా సత్యరాజ్‌తో కలిసి నటించడం సంతోషకరంగా పేర్కొన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ కోయంబత్తూర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం పూజై అని తెలిపారు. పూజై లాంటి మంచి కమర్షియల్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని శ్రుతిహాసన్ వ్యాఖ్యానించారు.