తప్పు జరిగినట్టు... ఒప్పుకున్నట్టేగా చంద్రబాబూ!

22 Nov, 2017 00:53 IST|Sakshi

కామెంట్‌ చేయడానికి ‘ఆధార్‌’ కావాలా?.. తాగి మాట్లాడావా లోకేశ్‌?

ఆయన సీఎం అయితే మేం బతికుంటామా? అలాంటి మంత్రి ఉండటం మా ఖర్మ

అవార్డులపై విమర్శిస్తే తెలుగు రోహింగ్యాలంటారేమో..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు విమర్శించలేదా?

జ్యూరీలో ఉన్నవాళ్లు నాన్‌ ఏపీ కాదా?

నంది అవార్డు తీసుకోవాలంటే సిగ్గేస్తోంది.. ఏపీ ప్రభుత్వంపై పోసాని ఫైర్‌

నాకు నంది అవార్డు రావడం సిగ్గుచేటు
సోమవారం ఓ వార్తాపత్రిక చదివా. అందులో ‘ఆపేస్తా నంది.. రాద్ధాంతం శృతిమించితే అవార్డులు ఎత్తేస్తాం’ అని ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త రాశారు. మంగళవారం ఆ పేపర్‌ చదివా. అందులో చంద్రబాబుగారు ఓ మాట, లోకేశ్‌బాబు ఓ మాట అన్నారు. లోకేశ్‌బాబు ఏమన్నారంటే.. ‘నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా ఎన్‌.ఆర్‌.ఏ. (నాన్‌ రెసిడెన్స్‌ ఆంధ్రాస్‌). ఏపీలో ఆధార్‌ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటంలో అర్థమేంటి? కేవలం ముగ్గురు నలుగురే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు’ అన్నారు.

కేసీఆర్‌గారికి పాదాభివందనం
తెలంగాణ సామాజానికి, ప్రజానీకానికి, రాజకీయ నాయకులకు, ప్రభుత్వంలోని పెద్దలకు, కేసీఆర్‌గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలెంత గొప్పవాళ్లో, నీతిమంతులో,  ఎంత దయార్థ హృదయులో, ఎంత అమాయకులో లోకేశ్‌బాబు స్టేట్‌మెంట్‌ చూశాక వంద శాతం అర ్థం చేసుకున్నా. ఒక్క నంది విషయంలో విమర్శలు చేస్తే ఆంధ్రావాళ్లం నాన్‌ రెసిడెన్స్‌ ఆంధ్రాసా? ఎన్నో సంవత్సరాలు తెలంగాణలో ఉండి రాజకీయాలు చేశారు ఆంధ్ర నాయకులు. కేసీఆర్‌గారు ‘మా పేచీ అంతా తెలంగాణను దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే కానీ, ఆంధ్ర ప్రజలతో కాదు. వాళ్లు మా బిడ్డల్లాంటి వాళ్లు’ అన్నారే కానీ, ‘వీళ్లు తెలంగాణావాళ్లు కాదు.. కొట్టండి.. తరమండి’ అనలేదు. అలా ఆయన అని ఉంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని కొట్టి ఖమ్మం బార్డర్‌ దాటించేవారు.

లోకేశ్‌ సీయం అయితే మేం బతికుంటామా?
లోకేశ్‌లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకుంటే ఇక్కడ ఆంధ్రావాళ్లను కొట్టేవారు. దీంతో మేం తలో దిక్కూ పారిపోయి తెలుగు రోహింగ్యాలు అయ్యేవాళ్లం. లోకేశ్‌ లాంటివారు ముఖ్యమంత్రి అయితే మేం బతికుంటామా? మమ్మల్ని బతకనిస్తారా?

లోకేశ్‌బాబూ తాగి మాట్లాడావా?
‘ఏంటీ.. ఆధార్‌ కార్డులు ఇక్కడ (తెలంగాణ) ఉన్నాయా? ట్యాక్స్‌లు ఇక్కడే కడుతున్నారా? అయితే ఏం? ఇక్కడివాళ్లు ఆంధ్రాలో పనికిరారా? ఇక్కడ కూర్చొని మీరు రాజకీయాలు చేయొచ్చు? ఇక్కడి నుంచి విమర్శించకూడదా?’ అని లోకేశ్‌ అన్నారు. లోకేశ్‌బాబూ.. చదువుకున్నావా? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. నీకా స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే.. 2024 వరకూ అధికారికంగా ఇక్కడ మేం బతకొచ్చు. తర్వాత కూడా బతకొచ్చు.మీ ఇళ్లు ఎక్కడున్నాయి? మీ కుటుంబానికంతటికీ ఆధార్‌ కార్డులు అక్కడే (అమరావతి) ఉన్నాయా? మీ భార్య, అత్త కుటుంబాలకు హైదరాబాద్‌లో సొంత ఇళ్లు లేవా? మీరు ట్యాక్స్‌ కట్టడం లేదా? మరి మీరెందుకు కడుతున్నారు? పన్ను తెలంగాణాలో కడతారు.. ఏపీలో మమ్మల్ని తిడతారా? అని  మీరెందుకు మమ్మల్ని అంటున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా మీరు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోలేదా? మీకు ఆస్తులు లేవా? షాపింగ్‌ కాంప్లెక్స్‌లు లేవా? మీరు ఇక్కడ పన్ను కడుతూ విజయవాడలో ఉండి రాజకీయాలు చేయొచ్చా? మేము పన్నులు కడుతూ మిమ్మల్ని విమర్శించకూడదా? మీ నీతి ఏంటి? మా నీతి ఏంటి? మీకు మాట్లాడే అర్హత ఉంది. మాకు లేదా?

జ్యూరీలో ఉన్నవాళ్లు నాన్‌ ఏపీ కాదా?
మేం ఆంధ్రవాళ్లం కాదు.. తెలంగాణవాళ్లం కాదు. కానీ, ఇక్కడే ఉంటున్నాం. మాకు మాట్లాడే అర్హత లేదా?  మరి నాన్‌ ఏపీ, నాన్‌ లోకల్‌ వాళ్లని ఎందుకు నంది అవార్డు జ్యూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని ‘నాన్‌ రెసిడెన్స్‌ ఆంధ్రాస్‌’ అన్నారు కదా? ప్రభుత్వం డబ్బుతో ఇక్కడి నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పెట్టారే వాళ్లందరికీ ఆంధ్ర ఆధార్‌ కార్డులున్నాయా? వాళ్లు ఇక్కడ ఉండి ఓటు వేశారా? అక్కడికి వచ్చి ఓటు వేశారా? మరి వార్ని జ్యూరీలో ఎందుకు పెట్టుకున్నారు? మీ దృష్టిలో వాళ్లు కూడా నాన్‌ రెసిడెంట్స్, నాన్‌ లోకలే కదా? తెలుగు రోహింగ్యాలే కదా? వారికెందుకు జ్యూరీలో ప్లేస్‌ ఇచ్చారో చెప్పం డి. బుద్ధి తెచ్చుకుంటా. నాకు జ్ఞానోదయం కలిగించండి.

ఇదేం నీతి?
నీకు ఇక్కడ ఇల్లుంది. ఇక్కడ పన్ను కడతావు. ఆంధ్రలో మంత్రి అవుతావు. మేము ఏమీ కాకూడదు? నోరెత్తాం.. తప్పా? రాద్ధాంతం శ్రుతి మించితే నంది అవార్డులు ఎత్తేస్తాం అంటారా? 2014 నుంచి తెలుగు ప్రజలు రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ఏం ఎత్తేశారు మీరు? మీ పార్టీలో గెలవలేదు. సైకిల్‌ గుర్తుపైన గెలవలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాను గుర్తుపై జగన్‌ తరఫున గెలిచారు. మీ పార్టీలోకి దూకారు. మీరు వారిని వాటేసుకున్నారు. ముద్దు లు పెట్టుకున్నారు. పార్టీలు చేసుకున్నారు. మేం రాద్ధాంతం చేస్తే నందులు ఎత్తేస్తారు. వాళ్లు మీ పార్టీ కాదు.. మీ గుర్తుకాదు.. జగన్‌ కష్టం అని ఫ్యాను గుర్తుకి ఓట్లేసిన ప్రజలు రాద్ధాంతం చేస్తున్నారే... మరి వాళ్లను (పార్టీ మారిన ఎమ్మెల్యేలు) ఎందుకు ఎత్తి పడేయడం లేదు? ఇదేం నీతి?

విమర్శిస్తే నంది ఎత్తేస్తారా?
మీలాంటి రాజకీయ నాయకులా ఈ దేశాధినేతలు.. ప్రజా సేవకులు. మేం వినాలి.. మా ఖర్మ కాలి.  చిన్న విమర్శలకే నందులు తీసేస్తాం అంటున్నావే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘భారతరత్న, పద్మ’ అవార్డులకూ విమర్శలున్నాయి. ఎత్తేస్తామన్నారా.. ఎత్తేశారా? విమర్శలు తీసుకోవడం లేదా? కాంగ్రెస్, బీజేపీ.. ఏ ప్రభుత్వానికైనా విమర్శలు తప్పవు. ఇది ప్రజాస్వామ్యం. మా మీద ప్రేమతో అవార్డులిస్తున్నారా? ప్రతిభావంతులకి పురస్కారాలు ఇస్తున్నారు. అది అన్ని రంగాల్లోనూ ఇస్తున్నారు. నంది అవార్డులు ఇస్తున్నారు. మేం ఇవ్వొద్దన్నామా? లోపాలున్నాయి. సరిదిద్దుకో అన్నందుకు నాన్‌ రెసిడెంట్సా? లోపాలు జరగలేదనీ న్యాయబద్ధంగా ఇచ్చామనీ జ్యూరీ సభ్యుల్ని లైవ్‌లో లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించుకోమనండి. న్యాయంగా వస్తే అందరి కాళ్లూ పట్టుకుని పాలాభిషేకం చేస్తా. నాకూ నంది అవార్డు వచ్చింది. అవార్డు కోసం పైరవీలు చేయను. నేను లఫూట్‌గాణ్ణో,  నిజాయితీగా బతికేవాణ్ణో అందరికీ తెలుసు. ఈ అవార్డు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా. పోసాని కమ్మవాడు కాబట్టి, ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటార్రా అని అంటారు. అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను కూడా విమర్శలు ఫేస్‌ చేయాలి.. తప్పదు.

తెలుగు రోహింగ్యా అని మమ్మల్ని తరిమేస్తారేమో!
అవార్డులపై విమర్శలు చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? పెళ్లాం, పిల్లలతో ఎప్పుడైనా విజయవాడ వెళితే మమ్మల్ని బ్రతకనిస్తారా? వీడెవడ్రా తెలుగు రోహింగ్యా.. తరిమి కొట్టండి అంటారేమో? మీరు ఆంధ్రాకి పాస్‌పోర్టు రెడీ చేస్తారేమో? ఓన్లీ తెలుగుదేశానికి  ఓట్లేసేవారే ఉండండి ఆంధ్రాలో.. అని ఫ్యూచర్లో అంటారేమో? అప్పుడు మేం కూడా పేర్లు మార్చుకుంటాం. పోసాని కృష్ణమురళి తీసేసి నర్సింగ్, యాదగిరి అని మార్చుకుని ఏ కరీంనగర్‌లోనే ఉంటాం. కనీసం వాళ్లు మమ్మల్ని బిడ్డల్లా చూస్తారు. ఇదే ఉమ్మడి ఆంధ్రాలో మీలాంటి నాయకులుంటే దేశం నాశనం అవుతుంది. రాష్ట్రం రెండు ముక్కలవడం అదృష్టం. కేసీఆర్‌లాంటి మహానుభావుడు రాబట్టి ఆంధ్ర అనే ఫీలింగ్‌ లేకుండా మా బిడ్డలు అని ప్రేమిస్తున్నాడు. మీరు నీతిగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా బ్రతకాలనుకుంటే... ఎలా రాజకీయాలు చేయాలో కేసీఆర్‌గారి దగ్గరకు వచ్చి నేర్చుకోండి. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. ఆయన రాజకీయాలు చేయొచ్చు. కానీ, ఒక మనిషిగా మానవత్వం  ఉన్నవాడు కాబట్టి ఆయన కాళ్లు కడిగి పాదాభివందనం చేసి ‘అన్నా.. ఎలా మంచి మాటలు మాట్లాడాలి. రాజకీయాలు చేయాలి?’ అని నేర్చుకోండి. ఇన్నాళ్లూ తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి కేసీఆర్‌ నాలుగు మాటలన్నా తప్పులేదు. కానీ, ఆయన నీతిగా మాట్లాడారు.

చచ్చిపోయే వరకూ నంది ముట్టుకోను!
మీరు ఒక్క నందికే ఆంధ్రవాళ్లని నాన్‌లోకల్స్‌ అని పడేశారే! ఏం మాట్లాడాలి మీ గురించి? లోకేశ్‌బాబుని నా ముందు కూర్చోబెట్టండి. ‘యస్‌.. పోసాని నేను చెప్పింది కరెక్టే’ అంటే నేను చెంపలేసుకుని వెళ్లిపోతా. ఈ అవార్డు తీసుకోవాలంటే సిగ్గేస్తోంది. నేను షూటింగ్‌లో ఉండగా ‘టెంపర్‌’ సినిమాకి నాకు నంది అవార్డు వచ్చిందని ఫోన్లు వచ్చాయి. ఇంటికెళ్లి టీవీ చూస్తుంటే ఇవి ‘కమ్మ అవార్డులు. కమ్మవారు పంచుకున్నారు’ అంటున్నారంతా. ఈ నంది అవార్డు నాకొద్దు. ఈ అవార్డుని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నా. ఇలాంటి నీచమైన పద్ధతుల్లో అవార్డు తీసుకునే ఖర్మ నాకు పట్టలేదు. అటువంటి సంస్కారం నాకు లేదు. ఈ నంది ఇప్పుడొద్దు. ఈ అవార్డులన్నీ రద్దు చేయండి. చంద్రబాబుగారు అన్నట్టు ఐఆర్‌వీసీ పద్ధతుల్లో అవార్డులివ్వమనండి. అప్పుడు నాకు అవార్డు రాకున్నా ఆయన కాళ్లకి దండం పెట్టి వచ్చేస్తా. ఈ అవార్డులతో చాలామంది అన్యాయం అయిపోయామని అంటున్నారు. రద్దు చేయండి. చేస్తే తప్పేంటి? దానికెందుకు అహంకారం? ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నాకు ఈ నంది వద్దు. ఈ అవార్డులను రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు.. నేను చచ్చిపోయేవరకూ నంది ముట్టుకోను. తప్పుదిద్దుకుంటారా? అప్పుడు నాకు రాకపోయినా పర్లేదు.

నంది ఆపేస్తానంటే మీ సొంత సొమ్మా?
 నంది ఆపేస్తానంటే ఇది మీ సొంత సొమ్మా? మీ డబ్బులతో అవార్డులు పెట్టుకోండి. లోకేశ్‌బాబు బంగారు నంది పెట్టుకోండి. కమ్మవాళ్లకే ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. మీకు నచ్చినవాళ్లకు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. నిజాయితీగా ఇవ్వదలచుకుంటే మాపై ఇన్ని నిందలు వేయవు. తెలుగు రోహింగ్యాలను చేయవు. మమ్మల్ని నాన్‌లోకల్‌ చేసి కొట్టించాలనుకున్నావా? కలహాలు రేపాలనుకున్నావా? ప్రాంతీయ దొరభిమానం పెట్టదలచుకున్నావా? ఈ నందులకీ ప్రాంతీయ తత్వానికి ఏంటి సంబంధం? హైదరాబాద్‌లో ఉన్న నీ ఇళ్లకు పన్ను గుంటూరులో కడతా వా? ‘విమర్శిస్తే మూడేళ్లు నందులివ్వం’ అంటూ ఓ పిచ్చి స్టేట్‌మెంట్‌. మీ అబ్బ సొమ్మా? ఏం స్టేట్‌మెంట్‌ అది?

మీదాకా వస్తే లోకల్‌.. నాన్‌ లోకలా?
ఏంటి.. విమర్శలు తీసుకోరా? చంద్రబాబుగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని విమర్శించారు. విమర్శించాడని ఆయన్ని రాజకీయాలనుంచి వెళ్లగొట్టారా? అవినీతి, అక్రమాలు జరిగాయనే కదా ఆయన విమర్శించారు. అందుకని ఆయన్ని కొట్టారా? నాన్‌లోకల్‌ అని చెప్పి చిత్తూరు పంపించారా? మేం కూడా మిమ్మల్ని నమ్మబట్టే కదా ముఖ్యమంత్రి అయ్యారు. మరి మాదాకా వచ్చేసరికి లోకల్, నాన్‌లోకల్‌ అనడమెందుకు?

అవార్డులు ఆపేస్తారని మీడియానే రాసిందా?
అవార్డులు ఆపేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ వార్త రాశారు కదా? మరి ఇది దొంగచాటుగా రాశారా? తెలుగుదేశానికి అనుకూలంగా ఇలాంటి వార్తలు మీడియానే రాసిందా? ‘ప్రభుత్వం ఆగ్రహం’ అంటే మీరు స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండానే పేపర్లో రాశారా? చెప్పండి? ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటే ఎవరు? వాళ్లని రమ్మనండి. నాది తప్పు అని నిరూపిస్తే వాళ్ల కాళ్లకి దండం పెట్టుకుని చెంపలేసుకుని వెళ్లిపోతా. పోనీ.. అవార్డులు ఆపేస్తామనే మాట ఎవరన్నారో? వారి పేర్లు చెప్పమనండి. ఇంత ఘోరమైన ప్రకటన ఎవరిచ్చారో వారి పేర్లు మీడియా చెప్పొచ్చుగా?

కామెంట్‌ చేయడానికి ఆధార్‌ కార్డు కావాలా?
వారంతా ఎన్‌.ఆర్‌.ఏ.(నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌) అనే మాట లోకేశ్‌ ఎందుకన్నారు? ఆంధ్రాలో ఓటు లేకుంటే విమర్శించకూడదా? సమాజానికి ఎవరైతే నష్టం కలిగిస్తారో వారి గురించి ఎవరైనా కామెంట్‌ చేస్తారు. కామెంట్‌ చేయడానికి ఆధార్‌ కార్డు కావాలా? అంటే ఆధార్‌ కార్డు.. ఐడీ కార్డుంటే ఏమైనా చేయొచ్చా? హత్యలు కూడా చేయొ చ్చా? అవి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలా?

మీరు గొప్పోళ్లా? మేమా?
తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందే తెలుగుదేశం నాయకులంతా పరిగెత్తుకుంటూ అమరావతి వెళ్లారు పొలాలు, స్థలాలు కొందామని. రాజధాని ఎక్కడొస్తుందా అని తెలిసి భూములు ఎకరాలకెకరాలు కొనేశారు. ఆంధ్రాని మొత్తం మీరు దొబ్బి తినేశారు. మేం పిచ్చినా కొడుకుల్లా ఇక్కడే ఉంటూ మీడియా ముందు కూర్చుని రెండు మాటలంటున్నాం. మీరా గొప్పోళ్లు? మేమా? విమర్శిస్తే తెలుగు రోహింగ్యాలు చేస్తారా? అమరావతి చుట్టుపక్కల పోసాని పొలాలున్నాయో? టీడీపీ కార్యకర్తలు, ఇంకా ఎవరెవరి భూములున్నాయో లెక్కలేయండి తెలుస్తుంది. అప్పుడూ అంతే.. హైటెక్‌సిటీ అనగానే సగం మందికిపైగా తెలుగుదేశం నాయకులు మాదాపూర్‌లో భూములు కొనేశారు. మేం ఎవరం? అడుక్కునేవాళ్లమా? మాట్లాడే హక్కు కూడా లేదా? నేను అనలేదు. టీవీలో చూశా. 12మంది జ్యూరీలో 10 మంది కమ్మవాళ్లుంటే ఎవరికైనా డౌట్‌ రాదా? ప్రభుత్వం వారు మీరు కమ్మోళ్లా? అన్నప్పుడు ‘అవును సార్‌’  అంటాం. ‘అయితే మీరు అప్పర్‌ క్లాస్‌.. మీకేం అవసరం లేదు’ అంటారు. ‘సార్‌.. మాకు అన్నం లేదు’ అంటే, ‘నువ్వు అప్పర్‌ క్లాస్‌ వాడివి కదా నీకెందుకయ్యా అన్నం’ అని నన్ను చిన్నప్పుడు అన్నవాళ్లూ ఉన్నారు. మా నాన్న కూలీ. 50 రూపాయలు అప్పు పుట్టక ఆత్మహత్య చేసుకున్నారు. అది వేరే విషయం. అవి కూడా మేం మాట్లాడలేదే? ఓన్లీ నందుల గురించి, తప్పుల గురించి మాట్లాడాం.

విజయవాడ వెళ్లొచ్చో లేదో.. క్లారిటీ ఇవ్వండి!
అన్నీ వద్దు. ఒక్క ‘బి.ఎన్‌. రెడ్డి’ అవార్డు గురించి మాట్లాడదాం. ఈ అవార్డులొచ్చిన వారి సినిమాలు, దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారి సినిమాలు పక్కనపెట్టండి. సామాజిక స్పృహ, సందేశం ఉండాలంటారు కదా. సుబ్బయ్యగారి ‘కలికాలం’ ఎంత మంచి సినిమా. ఆ చిత్రం చూసి, దర్శకులు కె.విశ్వనాథ్‌గారు ‘ఈ కథ నావద్దకు వచ్చిందయ్యా.. నేను చేయలేకపోయా. సుబ్బయ్యగారు బాగా తీశారు’ అన్నారు. సగటు మనిషి, అమ్మాయి కాపురం, అరుణకిరణం, అన్న, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు.. వంటి మహిళా సాధికారత ఉన్న గొప్ప సినిమాలు సుబ్బయ్యగారు తీస్తే.. ఇలాంటి రెండు గొప్ప సినిమాలైనా బి.ఎన్‌.రెడ్డి అవార్డు వచ్చినవాళ్లు తీశారా? సుబ్బయ్య ఆ అవార్డుకి పనికిరాడంటే ‘నేను అజ్ఞానిని. పిచ్చికుక్కలాగా ఏదో వాగేశా. క్షమించండి’ అంటా. ఈ డౌట్లు జనాలకి వచ్చాయి. అడిగారు కూడా. నాకు నంది రాకుండా మాట్లాడుంటే ‘వీడికి నంది అవార్డు రాలేదు. జీవితంలో రాదు కూడా. పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అందుకే తిడుతున్నాడు’ అంటా రు. నేను ఏ పార్టీవాణ్ణీ కాదు. నంది రావడంతో మాట్లాడే హక్కు వచ్చింది. ప్రభుత్వ వర్గాలను పిలిపించండి. నాది తప్పని నోరు మూయించండి. అప్పుడు నేను ‘ఇవి గొప్ప నంది అవార్డులు. ఇప్పుడే నా కళ్లు తెరుచుకున్నాయి. కుల పిచ్చే లేదు వీళ్లకి. అన్నీ న్యాయంగా ఇచ్చారు’ అని మెడలో బోర్డు వేసుకుని తిరుగుతా. న్యాయంగా ఇచ్చారని లోకేశ్‌బాబు అంటున్నారు కదా! అవార్డులిచ్చినవాళ్లు నాన్‌ రెసిడెన్స్‌ కదా! నువ్వే వాళ్లతో అవార్డులిప్పించి ఇప్పుడెందుకు ఆ మాటెత్తావ్‌? అంటే నోరు మూయించాలనా? ఎన్నాళ్లు మూయిస్తావ్‌? రౌడీలతో ఎన్నాళ్లు కొట్టిస్తావ్‌? ప్రశ్నిస్తే ఎంతమందిని చంపుతావ్‌? విజయవాడ Ðð ళ్లొచ్చో? లేదో ఓ క్లారిటీ ఇవ్వండి. ఇక్కడే కేసీఆర్‌గారి వద్ద పడుంటా.

లోకేశ్‌ వంటి మంత్రి ఉండటం మా ఖర్మ
నందుల గురించి విమర్శిస్తే జవాబు చెప్పాలి.  ఇది న్యాయం కాదు. అన్యాయమని చెబుతున్నా. అందరూ తెలుగువాళ్లే. పరిపాలనాపరంగా విడిపోయారంతే. మరి తెలుగోళ్ల మధ్య ‘నాన్‌ రెసిడెన్స్‌’ అని ఎందుకు పెడుతున్నావ్‌? నీలాంటి వాడు ఏరినప్పుడు మిగతావాళ్లు కూడా  ఏరతారు కదా? వీడు కమ్మోడు.. కాపోడు.. మాల.. మాదిగ.. బ్రాహ్మణ.. అంటూ జనాలు ఏరతారు. నీ విజ్ఞత ఏది? నంది అవార్డులకీ నాన్‌ రెసిడెన్స్‌కి సంబంధం ఉందా? లోకేశ్‌వంటి మంత్రి ఉండటం మా ఖర్మ. నీకు మాట్లాడటం రాదు.  ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేర్చుకోకుండా ప్రజల మీదనే తిరగబడుతున్నావా? నీకు ఓటు వేయనివాడు.. తెలుగుదేశం కానివాడు దుర్మార్గుడా? ఇది ప్రజాస్వామ్యం. దీని దెబ్బకి పెద్ద పెద్దవాళ్లే చంకనాకిపోయారు. ఆఫ్ట్రాల్‌ నువ్వెంత? నేనెంత? అధికారం ఎన్నాళ్లుంటది? ప్రజాస్వామ్యం, ప్రజలు, ఈ దేశం శాశ్వతం.
భారతదేశం జిందాబాద్‌.. రాజకీయ వ్యవస్థ జిందాబాద్‌.. ప్రజాస్వామ్యం జిందాబాద్‌.. అవినీతి డౌన్‌ డౌన్‌.. అది నీకుందో లేదో గుండెపై చేయి వేసుకో.. సమాధానం దొరుకుతుంది.

లోపం సరిదిద్దుకోరా?
చంద్రబాబుగారి స్టేట్‌మెంట్లు చూస్తే తెలుస్తోంది. ఈ నంది అవార్డులు మేం నిజాయితీగా ఇచ్చాం అని ఎక్కడా అనడం లేదు. ఇవి అలా చేసుంటే బాగుండేది. ఐఆర్‌వీసీ పద్ధతుల్లో ఇచ్చుంటే బాగుండేదేమో? అన్నారు. అంటే అర్థమేంటి? రచ్చ జరిగిందనేగా లోపల. మరో మంచి మాట కూడా అన్నారు. ఏముంది నంది అవార్డుల్లో.. జ్యూరీ సభ్యులు బాగా చూసుకుంటారని పెట్టాం. వాళ్లు ఇచ్చిందాన్ని మేం ఏం చేయగలం? అన్నారు. అంటే లోపం జరిగిందనేగా? (అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్టేగా!) ఆ లోపం సరిదిద్దుకోరా? ఇవే ప్రభుత్వాలు పరీక్షలు పెడతాయి. పేపర్‌ లీకైతే ఎన్నిసార్లు పరీక్షలు రద్దు చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలి కదా? ఎందుకు చేయరు? విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ.. సినిమా పరిశ్రమ పట్ల మరో నిజాయితీనా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అంటే డిస్‌క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు, హుందాగా రాజీనామా చేసినవారూ ఉన్నారు కదా? 

మరిన్ని వార్తలు