పొలిటికల్‌ సినిమా కాదు

29 Mar, 2019 06:23 IST|Sakshi
శ్రీలేఖ, అలీ, నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, జీవా

– పోసాని

‘‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ రాజకీయ సినిమా కాదు.. చక్కని కుటుంబ కథా చిత్రం. ‘రక్తకన్నీరు’ టైటిల్‌ బలంగా ఉన్నా సినిమా వినోదాత్మకంగా ఉంటుంది. అలా మా టైటిల్‌ని చూసి ఇది పొలిటికల్‌ సినిమా అనుకోవద్దు. చాలా గొప్ప కామెడీ ఉంటుంది’’ అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. బాబూమోహన్, పోసాని, జీవా, అలీ, నవీనారెడ్డి ముఖ్య తారలుగా పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’. పి.రత్నాకర్, భీమనాదం భరత్, శ్రీధర్‌ చల్లా నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు.

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఈ సినిమా షూటింగ్‌ చేశాం. టైటిల్‌ ఏంటన్నది సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. అలాంటిది ‘ఫలానా టైటిల్‌తో పోసాని ఓ సినిమా తీశారు, అది చంద్రబాబునాయుడుగారిని అన్‌పాపులర్‌ చేసేలా ఉంది’ అని ఎవరో ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అతను ఫిర్యాదులో పేర్కొన్న టైటిల్‌కి, మా టైటిల్‌కి చాలా తేడా ఉంది. ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అన్నది చాలా పాజిటివ్‌ టైటిల్‌.

ఇందులో చంద్రబాబు గురించి బ్యాడ్‌గా ఉంటే ఏపీలో నన్ను కూడా బ్యాన్‌ చేయండి. ఆయన్ని విమర్శించడానికి నేను ఈ సినిమా చేయలేదు. ఇందులో ఆయన పేరు, గెటప్, ఆలోచనలు ఏవీ ఉండవు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, హరికృష్ణ, బాలకృష్ణగార్ల పాత్రలు కూడా ఉండవు. ‘మేనిఫెస్టో’ అంశాలపై మాత్రమే చర్చించాం. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన కథ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ప్రజాస్వామ్యం, ప్రజల క్షేమం గురించి తీశాం. కులం, డబ్బు, మందుని చూసి కాకుండా నిజాయతీగా సేవ చేసేవాడికి ఓటెయ్యండి అని చెబుతున్నాం.

దీనికి, బాబుకి ఏంటి సంబంధం? అవినీతి, వెన్నుపోటు పొడిచినవాళ్లు భయపడాలి. కానీ, బాబు అలాంటివి చేయలేదు కదా? నిజాయతీపరుడు కదా? మరెందుకు ఉలిక్కిపడుతున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు చేసుకొని బతకడానికి. ఈ సినిమాకి, బాబుగారికి ఏ సంబంధం లేదు. ఇందులో 2రీళ్లు రాజకీయాలుంటే, మిగిలిన 12 రీళ్లు వినోదం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, రైతు సమస్యలు, నిరుద్యోగం, ప్రేమికుడి మోసం... ఇలాంటి అంశాలని చూపించాం.

ఒకర్ని టార్గెట్‌ చేయడానికి ఈ సినిమా తీయలేదు. ఈ సినిమాకి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు పోసాని ఉజ్వల్‌ రాశాడు. వాడికిది తొలి సినిమా. ప్రస్తుతం హంగేరీలో ‘మీడియా సైన్స్‌’ అనే కోర్సు చేస్తున్నాడు. కొత్తగా ఉంటుంది, బాగుంటుంది సినిమా తీయమని చెప్పి ఈ కథ నా చేతిలో పెట్టాడు. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసండి? వాడి వయసు 20ప్లస్‌. కానీ, ఆలోచనల్లో నాకంటే పదేళ్లు ముందుంటాడు’’ అన్నారు.

నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పోసాని నమ్మింది ధైర్యంగా, ముక్కుసూటిగా చెబుతాడు. ఆయన రచనా శైలికి సెల్యూట్‌. పాలించేవారెవరైనా ఆడిన మాట తప్పకూడదు. ప్రజల పట్ల పాలకులకు భయం, భక్తి ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకిచ్చిన మాట తప్పొద్దు. ఎవరో ఏదో ఫిర్యాదు చేశారని అమరావతికి రండి అంటూ చెప్పొద్దని నేను ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రజల పక్షం. మాకు సెన్సార్‌ బోర్డు ఉంది. ఏదైనా అభ్యంతరాలుంటే కట్స్‌ చెబుతారు. మమ్మల్ని అమరావతి పిలిచించి సంజాయిషీ అడగకండి’’ అన్నారు.

అలీ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో పరుచూరి బ్రదర్స్‌ వద్ద అసిస్టెంట్‌గా చేసిన పోసాని అన్న ‘పోలీస్‌ బ్రదర్స్‌’ సినిమాతో రచయితగా మారారు. హరికృష్ణ, కృష్ణగార్లతో పాటు ఇండస్ట్రీలోని కమెడియన్లందర్నీ పెట్టి ‘శ్రావణమాసం’ సినిమా తీశారు. ఆ చిత్రం ఫ్లాప్‌ అయినా ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా లేదనకుండా ఆస్తులు అమ్మి మరీ చెల్లించిన గొప్ప మనసున్న వ్యక్తి’’ అన్నారు.
బాబూమోహన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఎందుకు? అని అందరూ అడుగుతుంటే, మంచి పాత్ర వస్తే చేస్తానని చెబుతున్నా. పోసాని మన సినిమా చేయాలనగానే మంచి పాత్ర దొరికిందనుకున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా