నారా లోకేశ్‌ పై విరుచుకుపడ్డ పోసాని

21 Nov, 2017 13:52 IST|Sakshi

మమ్మల్ని తెలుగు రోహింగ్యాలను చేస్తారా..?

ఈ అవార్డులను రద్దు చేయాలి.. తిరిగి ఎంపిక చేయాలి

లోకేష్ వ్యాఖ్యలపై పోసాని సీరియస్

‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో మంగళవారం ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పై పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.?..లోకేశ్‌... చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా... మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు' అంటూ ప్రశ్నించారు. నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా?. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా?

విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు.

టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ  అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా..  అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. అందుకే ఈ అవార్డులను రద్దు చేయండి. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయండి. ’ అని పోసాని కోరారు.

నంది అవార్డులను రద్దు చేయాలి 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా