త్వరలో విడుదలకు పవర్‌పాండి

15 Dec, 2016 02:49 IST|Sakshi
త్వరలో విడుదలకు పవర్‌పాండి


పవర్‌పాండి చిత్రం విడుదల తేదీ ఫిక్స్‌ అయ్యింది. స్టార్‌ నటుడు ధనుష్‌ తొలిసారిగా మోగాఫోన్‌ పట్టిన చిత్రం పవర్‌పాండి. దీన్ని తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తూ, ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ధనుష్‌. సినీయర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మరోనా సెబాస్టియన్, చాయాసింగ్, ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు గౌతమ్‌మీనన్, విజయ్‌ టీవీ దైవదర్శిని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పవర్‌పాండి చిత్రానికి షాన్‌ రోనాల్డ్‌ సంగీతం, వేల్‌రాజ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

చిత్ర షూటింగ్‌ను సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసిన ధనుష్‌ అదే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిసింది. ఇది ఒక స్టంట్‌ కళాకారుడి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. పవర్‌పాండి చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ధనుష్‌ మరో పక్క గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా చిత్రం షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.