‘సీసీసీ’కి విరాళాల వెల్లువ

30 Mar, 2020 15:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రభావంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సి. సి. సి. మనకోసం (కరోనా క్రైసిస్‌ చారిటీ మనకోసం) సంస్థకు టాలీవుడ్‌ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు ఇప్పటికే ఆయన 4 కోట్ల రూపాయలు ప్రకటించారు. తాజాగా ‘సీసీసీ’కి రూ.50 లక్షలు ప్రకటించారు. దీంతో ఆయన ప్రకటించిన మొత్తం విరాళం రూ.4.5 కోట్లకు చేరింది.

సైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా  ‘సీసీసీ’కి రూ. 20 లక్షలు ప్రకటించారు. కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కలిపి ఆయన కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేన్స్‌ కూడా ‘సీసీసీ’కి రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. హీరో సుశాంత్‌ రూ. 2 లక్షలు సహాయం అందిస్తామన్నారు. ప్రముఖ నిర్మాత, జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్స్ యజమాని కరాటం రాంబాబు ‘సీసీసీ’కి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. నటుడు బ్రహ్మజీ రూ. 75 వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేందుకు, తగిన సాయం చేసేందుకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్‌కి దర్శకుడు సతీష్ వేగేశ్న తన వంతు సాయంగా 50,000 రూపాయలు అందించారు. కష్ట కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఈ విపత్తుని ఎదుర్కొందామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. (చదవండి: సాయం సమయం)

 ‘సీసీసీ’కి విరాళాలు ఇచ్చిన వారు..
► రవితేజ  (20 లక్షలు)
► వరుణ్‌ తేజ్‌ (20 లక్షలు)
► ‘దిల్‌’ రాజు, శిరీష్‌  (10 లక్షలు)
► శర్వానంద్‌  (15 లక్షలు)
► సాయిధరమ్‌ తేజ్‌ (10 లక్షలు)
► విశ్వక్‌ సేన్‌  (5 లక్షలు)
► ‘వెన్నెల’ కిశోర్‌ (2 లక్షలు)
► సంజయ్‌ (25 వేలు)

మరిన్ని వార్తలు