అదొక అద్భుతమైన అనుభూతి!

3 Apr, 2016 23:24 IST|Sakshi
అదొక అద్భుతమైన అనుభూతి!

హాలీవుడ్ చిత్రాలను చూసినప్పుడు ఇలాంటి చిత్రాలు మన దేశంలో కూడా వస్తే బాగుండు అని కోరుకోనివారుండరు. ఆ స్థాయి చిత్రాలు తీయాలంటే వేల కోట్లు కావాలి కాబట్టి, అది సాధ్యం కాదని అనుకోనివారూ ఉండరు. అయితే మనం కూడా ఎందులోనూ తీసిపోమనీ, హాలీవుడ్ చిత్రాలను తలపించే రీతిలో తీయగలమనీ నిరూపించిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన  ఈ చిత్రం జాతీయ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. 

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది ఈ రెండో భాగం విడుదల అవుతుంది. కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విడుదలైన తొలి భాగం ఇంకా అక్కడక్కడా కొన్ని థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. మ్యాట్నీ షోలో ఈ చిత్రాన్ని చూపిస్తున్నారు.

మరో మూడు నెలలైతే ఈ చిత్రం విడుదలై ఏడాది అవుతుంది. ఇప్పటికీ ఆడుతోంది కాబట్టి, ఏయే థియేటర్లో ఈ చిత్రం ఆడుతోందో వాటిని ప్రభాస్ సందర్శిస్తే బాగుంటుందని ఆ థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రభాస్‌కు పంపించారని సమాచారం. ఎగ్జిబిటర్ల ఆకాంక్షను స్వయంగా చదివిన ప్రభాస్ సానుకూలంగా స్పందించారట. ‘‘సినిమా పరిశ్రమలో థియేటర్ ఓనర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ల అభిప్రాయాలు ఎంతో విలువైనవి.

‘బాహుబలి’ విడుదలై ఏడాది కావస్తున్నా, ఇంకా ఈ చిత్రానికి అభినందనలు లభించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది’’ అని సన్నిహితులతో ప్రభాస్ అన్నారట. ఇదిలా ఉంటే.. ‘బాహుబలి’ తొలి భాగం అప్పుడు ఆ షూటింగ్ బిజీ వల్ల, ఇప్పుడు మలి భాగంతో బిజీగా ఉండటంవల్ల ప్రభాస్ పెద్దగా బయటకు రావడంలేదు. అప్పుడప్పుడూ ఏదైనా ఆడియో వేడుకలో కనిపించడం మినహా అభిమానులకు వేరే వేడుకల్లో కనిపించడంలేదు. అందుకని రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను కలవాలనుకున్నారట.

కొంతమంది అభిమానులకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అభిమానులందర్నీ ఒకేసారి కలవడం కుదరదు కాబట్టి, ఒక టీమ్‌ని ఏర్పాటు చేశారట. ఆ టీమ్ నిర్ణయించిన సమయాల్లో ఒక్కో గ్రూప్‌గా అభిమానులు విడిపోయి, ప్రభాస్‌ను ఆయన ఇంట్లోనే కలుస్తున్నారట.