భవిష్యత్‌ తెలిసిపోద్ది

8 Oct, 2018 02:25 IST|Sakshi
ప్రభాస్,

ఓ గంట తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? గంట కాదు కదా! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ, హీరో ప్రభాస్‌ మాత్రం ఊహించి భవిష్యత్‌ చెబుతారట. అంతేకాదు.. రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి వాటిని తప్పిస్తారట. కానీ, ఇదంతా సినిమాలోని క్యారెక్టర్‌ పరంగానే. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్, పూజాహెగ్డేలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘అమోల్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పెట్టారని టాక్‌. ఈ పదానికి ఫ్రెంచ్‌ భాషలో ‘ప్రేమ, సోయగం’ అనే అర్థాలు ఉన్నాయి. అంతేకాదు.. ఇదే టైటిల్‌తో ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్‌ దర్శకుడు మైఖేల్‌ హనేకే ఓ సినిమా రూపొందించడం విశేషం. ఈ విషయంపై చిత్రబృందం అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఈ సినిమాకు అమిత్‌ త్రివేది స్వరాలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు