గాంధీ... మోదీ తర్వాత ప్రభాస్‌కే!

2 Oct, 2016 08:31 IST|Sakshi
గాంధీ... మోదీ తర్వాత ప్రభాస్‌కే!

సత్యం, అహింసలే ఆయుధంగా చేసుకున్న జాతిపిత మహాత్మా గాంధీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. వీళ్లిద్దరి తర్వాత ఆ గౌరవం ప్రభాస్‌కే అంటే.. ఆ గౌరవం దేనికి సంబంధించినది అయ్యుంటుందా? అని ఆశ్చర్యపోవడం సహజం. రాజకీయాలతో సంబంధం లేని గౌరవం ఇది. మైనపు విగ్రహాల రూపకల్పనలో పేరున్న కళాకారిణి ‘మేడమ్ టుస్సాడ్’ పేరున లండన్‌లో ప్రసిద్ధ మ్యూజియమ్ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాల్ని అక్కడ పెడుతుంటారు. ప్రపంచంలోని పలు చోట్ల ఆ మ్యూజియమ్ బ్రాంచ్‌లున్నాయి. బ్యాంకాక్‌లోని శాఖలో మన దేశం నుంచి మహాత్మా గాంధీ, ఆ తర్వాత నరేంద్ర మోదీ బొమ్మలు అక్కడ పెట్టారు.
 
 తాజాగా ప్రభాస్ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించనున్నారు. ఈ గౌరవం దక్కించుకుంటున్న తొలి దక్షిణ భారతీయుడు ప్రభాసే కావడం విశేషం. శుక్రవారం జరిగిన ‘బాహుబలి 2’ ప్రెస్‌మీట్‌లో ‘ఈ నెల 5న ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఓ తీపి కబురు చెప్తా’ అని రాజమౌళి ఊరించారు. ఆ కబురు ఈ మైనపు బొమ్మకు సంబంధించినదే. ఆయన చెప్పే లోపే విషయం బయటకు రావడంతో ‘‘5న చెప్పాలను కున్నది ఇవాళే చెప్పేస్తున్నా. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ ప్రతిమను అక్కడ ప్రతిష్ఠిస్తారు’’ అని శనివారం రాజమౌళి వెల్లడించారు. ‘బాహుబలి’లో శస్త్రాస్త్రాలు ధరించిన అమరేంద్ర బాహుబలి గెటప్‌లో ఈ బొమ్మ ఉండనుంది.

 
 విగ్రహం అచ్చంగా ప్రభాస్ లాగే అనిపించేందుకు టుస్సాడ్స్ వారు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, ప్రభాస్‌తో సిట్టింగ్ వేసి, రకరకాల కోణాల్లో ఆయన్ను 350 ఫోటోలు తీశారు. ఒంటి కొలతలు తీసుకున్నారు. ‘‘గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికులు వెతికే వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. ఆయన ప్రతిమను పెట్టాలని ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానులు కోరారు’’ అనీ, భారతీయ చిత్రాల్లో వసూళ్ల పరంగా ‘బాహుబలి’ చరిత్ర సృష్టించడమే ఈ బొమ్మ పెట్టాలనుకోవడానికి కారణమనీ అని బ్యాంకాక్‌లోని టుస్సాడ్స్ శాఖ జనరల్ మేనేజర్ తెలిపారు. అభిమానుల వల్లే ఇది సాధ్యమైందనీ, చాలా ఆనందంగా ఉందనీ హీరో ప్రభాస్ వ్యాఖ్యానించారు.