జోడీ కుదరలేదు

16 Mar, 2017 00:02 IST|Sakshi
జోడీ కుదరలేదు

ప్రభుదేవా, తమన్నా మరో సినిమా చేస్తు్తన్నారు. గతేడాది వచ్చిన హారర్‌ కామెడీ ‘అభినేత్రి’లో వీళ్లిద్దరూ జంటగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే... ఈసారి జోడీ కుదరలేదు. ఆశ్చర్యంగా ఉందా? మరేం లేదు. ఇందులో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారు. మరి, హీరో ఎవరంటే.. ఎవరూ లేరు. లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ కదా, తమన్నాదే మెయిన్‌ క్యారెక్టర్‌. సో.. తనే హీరో కింద లెక్క. తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైవుదిర్‌ కాలమ్‌’ సినిమా హిందీ రీమేక్‌లోనే ప్రభుదేవా–తమన్నా నటించనున్నారు.

 చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ‘కొలైవుదిర్‌...’ ఇంకా విడుదల కాలేదు. కానీ, హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనతో దర్శక–నిర్మాతలు ప్రభుదేవా, తమన్నాలకు కథ వినిపించగా... గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఆల్రెడీ లండన్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. హిందీ వెర్షన్‌కూ చక్రి తోలేటియే దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార పాత్రను హిందీలో తమన్నా చేస్తున్నారు. సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజాతో కలసి ‘కొలైవుదిర్‌ కాలమ్‌’ను నిర్మిస్తున్న వశూ భగ్నానీయే హిందీ చిత్రానికి కూడా నిర్మాత. ‘‘ఫస్ట్‌ టైమ్‌ నేను విలన్‌గా నటిస్తున్నాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు విభిన్నంగా ఉంటుంది.

 ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తా’’ అన్నారు ప్రభుదేవా. సీనియర్‌ హీరోయిన్‌ భూమిక చావ్లా కూడా హిందీ వెర్షన్‌లో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా... తమిళ దర్శకుడు శీను రామసామి.. ప్రభుదేవా, తమన్నా జంటగా ఓ సినిమా తీయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. మరి, ఆ సినిమా ఏమైందో?